Coffee | మనలో చాలా మంది కాఫీని ఇష్టంగా తాగుతూ ఉంటారు. కాఫీకి ఉండే గొప్ప రుచి, దాని ఉత్తేజపరిచే ప్రభావాలే దానిని మరింత ఇష్టపడేలా చేస్తాయని చెప్పవచ్చు. కాఫీ తక్షణ శక్తిని ఇవ్వడంతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లతో పాటు పాలీఫినాల్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. దీనిని తీసుకోవడం వల్ల శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అయితే కాఫీని తీసుకునే విషయంలో చాలా మంది తప్పులు చేస్తున్నారని వైద్యులు చెబుతున్నారు. ఈ తప్పుల కారణంగా కాఫీ తీసుకోవడం వల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. కాఫీ తీసుకునే విషయంలో చాలా మంది చేస్తున్న సాధారణ తప్పుల గురించి వైద్యుల మాటల్లో తెలుసుకుందాం.
చాలా మంది కాఫీలో చక్కెర కలిపి తీసుకుంటారు. ఇలా తీసుకోవడం రుచిగా ఉన్నప్పటికీ చక్కెర రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచుతుంది. కనుక చక్కెరకు బదులుగా కాఫీ కొద్దిగా చల్లారిన తరువాత అందులో తేనె కలిపి తీసుకోవచ్చు. అలాగే మాంక్ ఫ్రూట్ లేదా స్టీవియాను కలిపి తీసుకోవచ్చు. కాఫీ పంటకు పురుగు మందుల వినియోగం ఎక్కువగా ఉంటుంది. పురుగు మందులు ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపిస్తాయి. కనుక అధిక సేంద్రీయ నాణ్యత కలిగిన కాఫీని మాత్రమే తీసుకోవాలి. యాసిడ్ రిఫ్లెక్స్ ఉన్న వారు తేలికపాటి రోస్ట్ కలిగిన కాఫీని తీసుకోవడం వల్ల లక్షణాలు మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. కనుక యాసిడ్ రిఫ్లెక్స్ ఉన్న వారు ముదురు రంగు రోస్ట్ కలిగిన కాఫీగింజలను తీసుకోవాలి. కాఫీ తీసుకునే విషయంలో చాలా మంది ఇలాంటి తప్పులు చేస్తున్నారని వైద్యులు చెబుతున్నారు. ఈ తప్పుల కారణంగా కాఫీ ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపిస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఇక కాఫీ తీసుకునే వారు ఇప్పుడు చెప్పే కొన్ని చిట్కాలను పాటించడం వల్ల కాఫీ వల్ల అధిక ప్రయోజనాలను పొందవచ్చు. కాఫీలో కెఫిన్ ఎక్కువగా ఉంటుంది. దీనిని అధికంగా తీసుకోవడం వల్ల చికాకు, నిద్ర సమస్యలు, అధిక రక్తపోటు, హృదయ స్పందన రేటులో మార్పులు రావడం, జీర్ణ సమస్యలు రావడం వంటివి జరుగుతాయి. కనుక కాఫీని తక్కువ మోతాదులో తీసుకోవాలి. రోజుకు 400 మిల్లీగ్రాముల కెఫిన్ ను మాత్రమే తీసుకోవాలి. అలాగే కాఫీని సాయంత్రం సమయంలో తీసుకోకూడదు. ఇలా తీసుకోవడం వల్ల నిద్రకు ఆటంకం కలుగుతుంది. కనుక కాఫీని ఉదయం లేదా మధ్యాహ్నం మాత్రమే తీసుకోవాలి. అలాగే పరగడుపున కాఫీని తీసుకోకూడదు. కాఫీ శరీరాన్ని డీహైడ్రేషన్ బారిన పడేలా చేస్తుంది. ఈ డీహైడ్రేషన్ ను సవరించడానికి నీటిని ఎక్కువగా తాగాలి. అలాగే కెఫిన్ ఒక్కొక్కరిలో ఒక్కోలా ప్రభావాన్ని చూపిస్తుంది. కనుక కాఫీని తాగే వారు ఎల్లప్పుడూ శరీరంలో జరిగే మార్పులను గమనిస్తూ ఉండాలి. ఈ చిట్కాలను పాటిస్తూ కాఫీని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుందని వైద్యులు సూచిస్తున్నారు.