పెద్దపల్లి, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ): దాదర్ ముంబై వీక్లీ ఎక్స్ప్రెస్ రైళ్ల రాకపోకలు నిలిచిపోయి 9 నెలలైనా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. కాజీపేట నుంచి దాదర్ ముంబై 07196/95 వయా పెద్దపల్లి-నిజామాబాద్ వీక్లీ ప్రత్యేక ఎక్స్ప్రెస్, కాజీపేట నుంచి దాదర్ ముంబై 07197/98 వీక్లీ ప్రత్యేక ఎక్స్ప్రెస్ వయా బల్లార్షా-ఆదిలాబాద్ మీదుగా ఇరుమార్గాల్లో నడిచే రైళ్లు తొమ్మిది నెలల కింద రద్దయ్యాయి. దీంతో వరంగల్, పెద్దపల్లి, ఆదిలాబాద్, నిజామాబాద్ నుంచి ముంబై, షిర్డీ వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అత్యధిక ఖర్చు పెట్టుకొని బస్సుల్లో ప్రయాణించాల్సి వస్తున్నదని వారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. తక్షణమే కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్, పెద్దపల్లి, నిజామాబాద్, వరంగల్, ఆదిలాబాద్ ఎంపీలు స్పందించి ఈ రైళ్లు తిరిగి నడిచేలా కృషి చేయాలని వారు కోరుతున్నారు.