హైదరాబాద్, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ): నైరుతి బంగాళాఖాతంలో ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్రా తీరానికి సమీపంలో కొనసాగిన చక్రవాత తుఫాను ‘దిత్వా’ ఆదివారం సాయంత్రం బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ తీవ్ర వాయుగుండం ఉత్తరదిశలో కదిలి.. సోమవారం ఉదయం పశ్చిమ, మధ్య బంగాళాఖాతంలో చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 50కి.మీ, నెల్లూరుకు దక్షిణ ఆగ్నేయంగా 200కి.మీ దూరంలో కేంద్రీకృతం అయిందని వెల్లడించింది.
రాగల 12 గంటల్లో ఈ తీవ్ర వాయుగుండం తీరానికి సమాంతరంగా కదులుతూ.. ఉత్తర తమిళనాడు దక్షిణ ఆంధ్రా తీరం సమీపంలో బలహీనపడి, వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్టు తెలిపింది. ఆ తర్వాత ఈ వాయుగుండం చెన్నై తీరానికి సుమారు 30 కి.మీ దూరానికి చేరుకునే అవకాశం ఉన్నట్టు అంచనా వేసినట్టు వివరించింది. దీని ప్రభావంతో మంగళవారం రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నది.
బుధవారం నుంచి వాతావరణం పొడిగా ఉంటుందని వెల్లడించింది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 28 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 17డిగ్రీల వరకు ఉంటాయని తెలిపింది. గడిచిన 24గంటల్లో హనుమకొండ, నిర్మల్, ఖమ్మం, కామారెడ్డి, కొత్తగూడెం జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసినట్టు పేర్కొన్నది. హనుమకొండ జిల్లా కొండపర్తిలో 5.8 మి.మీ ఖమ్మం జిల్లా దుమ్ముగూడెంలో 3.3 మి.మీ, చర్లలో 3.0 మి.మీ, నిర్మల్ జిల్లా వాడ్యాల్లో 2.8 మి.మీ, బూర్గంపాడులో 2.3 మి.మీ, కామారెడ్డి జిల్లా మహ్మద్నగర్లో 2.1 మి.మీ, ఖమ్మం జిల్లా వేంసూరులో 1.9 మి.మీ వర్షపాతం నమోదైనట్టు వెల్లడించింది.
కాగా, ఆదిలాబాద్, కామారెడ్డి, నిర్మల్, నిజామాబాద్, కుమ్రంభీం జిల్లాల్లో రాత్రి కనిష్ఠ ఉష్ణోగ్రతలు 14డిగ్రీలుగా నమోదైనట్టు వాతావరణ కేంద్రం తెలిపింది. మిగతా జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగినట్టు వెల్లడించింది. ఇదిలా ఉండగా, దిత్వా తుఫాను కారణంగా రాష్ట్య్రవాప్తంగా చలిగాలులు వీస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.