హైదరాబాద్ సిటీబ్యూరో, మే 10 (నమస్తే తెలంగాణ): ‘చట్టాలు అందరికీ సమానమే. ఎవరు తప్పుచేసినా అవే సెక్షన్లు.. అవే శిక్షలు’ కానీ ఈ మాటలు కాగితాలకే పరిమితమవుతున్నాయని చాలా సందర్భాల్లో రుజువవుతున్నది. ముఖ్యంగా అమాత్యుల విషయాల్లో చట్టాలు వా రికి చుట్టాలుగా మారుతున్నాయి. నాయపరమైన అడ్డంకులు ఆసరా అవుతున్నాయి. అదే సామాన్య ప్రజల విషయంలో చిన్నపాటి ఘటన జరిగినా వెంటనే కేసులు నమోదవుతాయి. చాలా సందర్భాల్లో నిందితుల కంటే బాధితులపైనే అక్రమ కేసులు నమోదవుతుంటాయి.
ఈ క్రమంలోనే తాజాగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిపై నమోదైన పొక్సో కేసు వ్యవహారంలోనూ సైబరాబాద్ పోలీసులు విచిత్ర ధోరణి అవలంబిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాధారణంగా మైనర్‌పై ఎవరైనా అఘాయిత్యాలకు పాల్పడినట్టు ఫిర్యాదులు అందిన వెంటనే ఆరోపణలు ఎదుర్కొనే వ్యకిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, సదరు వ్యక్తిని పిలిపించి విచారిస్తారు. బాధితురాలి నుంచి ఫిర్యాదు అందిన తర్వాత వారి స్టేట్మెంట్ను రికార్డు చేసుకొని, ఆమె ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా అవసరమైతే సెక్షన్లను కూడా మారుస్తారు. బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని విచారించి తదుపరి చర్యలు తీసుకుంటారు.
బండి భగీరథ్ కేసు వ్యవహారంలో చూపిస్తున్న ఉదాసీనత సామాన్యులపై మాత్రం కనిపించదు. లైంగిక దాడి కేసు లేదా పొక్సో కేసు నమోదైనప్పుడు వెంటనే ఆరోపణలు ఎదుర్కొనే వ్యక్తిని పిలిపించి విచారణ మొదలుపెడతారు. విచారణ పేరుతో నిజాలను రాబట్టేందుకు నిందితుడికి చుక్కలు చూపిస్తారు. కానీ తాజా కేసులో మాత్రం పోలీసులు బాధిత కుటుంబానికే సినిమా చూపిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. లైంగిక వేధింపులకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న భగీరథ్‌పై ఎఫ్ఐఆర్ నమోదై మూడు రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు కనీసం నిందితుడిని పిలిపించి విచారించే సాహసం పోలీసులు చేయకపోవడంపై జనం మండిపడుతున్నారు. బాధితురాలి నుంచి స్టేట్మెంట్ రికార్డు చేసిన తర్వాతే నిందితుడి గురించి ఆలోచిస్తామని, ఆ ప్రక్రియ జరుగుతుందని పోలీసులు చెప్తున్నారు.
మైనర్ నుంచి ఫిర్యాదును స్వీకరించే దగ్గరి నుంచి కేసు నమోదు చేసే వరకు పోలీసులు హైడ్రామా చేస్తున్నారు. తనకు జరిగిన అన్యాయంపై ఈనెల 8న సాయం త్రం బాలిక ఫిర్యాదు చేస్తే అర్ధరాత్రి వరకు కూడా కేసు నమోదు చేయకుండా తాత్సా రం చేసిన పోలీసులు.. తప్పని పరిస్థితుల్లో జరిగిన ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయం బయటకు పొక్కడం, మీడియా దృష్టి సారించడంతో చేసేదిలేక మరుసటి రోజు భరోసా సెంటర్‌కు బాధితురాలిని రప్పించి, జరిగిన ఘటనపై ఆమె వాంగ్మూలం రికార్డు చేశా రు. ఇది జరిగి రెండు రోజులు కావస్తున్నది. ఈలోగా నిందితుడు తన ఇన్‌స్టాగ్రామ్‌తోపాటు ఇతర సోషల్ మీడియా ఖాతాలను డిలీట్ చేసినట్టు తెలుస్తున్నది. ఇప్పటివరకూ నిందితుడిని పిలిపించి విచారించకపోవడంపై మహిళా, యువజన సంఘాలు, ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.