హైదరాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ) : విద్యార్థి దశలోనే సైబర్ మోసాలపై అవగాహన కల్పిచేందుకు తెలంగాణ ఉన్నత విద్యామండలి కీలక నిర్ణయం తీసుకున్నది. ‘సైబర్ సోల్జర్స్’ పేరుతో ప్రత్యేక సైన్యాన్ని తయారుచేయనున్నది. సైబర్ మోసాలు జరుగుతున్న తీరు, వాటితో ఎలా జాగ్రత్తగా వ్యవహరించాలో అవగాహన కల్పిస్తారు. రాష్ట్రంలోని 5.8లక్షల మంది డిగ్రీ విద్యార్థులను సైబర్ సోల్జర్లుగా తయారుచేస్తారు.
ఇందుకోసం తొలుత ట్రైనర్స్ (శిక్షకులను) సిద్ధం చేస్తారు. ప్రాథమికంగా వెయ్యి మంది ట్రైనర్లను సిద్ధంచేయాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ఈ వెయ్యి మంది డిగ్రీ కాలేజీలకు వెళ్లి విద్యార్థులకు అవగాహన కల్పిస్తారు. వారం పది రోజుల్లో సైబర్ సోల్జర్స్కు శిక్షణ ప్రారంభించనున్నట్టు ఉన్నత విద్యామండలి చైర్మన్ వీ బాలకృష్టారెడ్డి తెలిపారు.