హైదరాబాద్, జూన్ 9(నమస్తే తెలంగాణ) : దేశంలోనే అత్యంత గొప్ప సాంకేతిక వ్యవస్థను ఉపయోగిస్తున్న రాష్ట్ర పోలీసు వ్యవస్థను హ్యాకర్లు సవాల్ చేస్తున్నారు. ఇటీవల పోలీస్ వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసి డార్క్ అంగట్లో పెట్టడం, హైకోర్టు వెబ్సైట్ హ్యాకింగ్ ఘటన మరువకముందే.. ప్రపంచవ్యాప్తంగా సైబర్ నేరాలపై అవగాహన కల్పించే సంస్థనే ఈసారి హ్యాకర్ల దాడికి గురికావడం కలకలం రేపుతున్నది. తెలంగాణలో డిజిటల్ భద్రతను, సైబర్ నేరాలను పర్యవేక్షించే అత్యున్నత విభాగం సైబర్ సెక్యూరిటీ బ్యూరో(టీఎస్‌సీఎస్‌బీ) అధికారిక ఎక్స్ ఖాతా హ్యాకింగ్‌కు గురైంది. ఏ వ్యవస్థ అయితే తమకు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తీసుకొస్తుందో.. అదే వ్యవస్థను హ్యా క్ చేసి దాని నుంచే తమ అకౌంట్లను ప్రమోట్ చేయడంతో పాటు కామెంట్లు చేస్తూ లాఫింగ్ ఎమోజీలు పెడుతూ సవాల్ చేశారు. ఇంత జ రిగినా అకౌంట్ హ్యాకింగ్ విషయం ఆలస్యం గా తెలుసుకున్న అధికారులు.. చాలా ఆలస్యం గా దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఈ విషయాన్ని నెటిజన్లు స్క్రీన్‌షాట్ తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో హ్యాకర్లు పెట్టిన పోస్టులను డిలీట్ చేశారు.
19 రోజుల తర్వాత మేల్కొన్న అధికారులు
హ్యాకింగ్ గత నెల 22న జరిగినా అధికారులకు సుమారు 19రోజుల తర్వాత తెలిసిందంటే అతిశయోక్తి కాదు. వారం పాటు హ్యాక్ చేసినా గుర్తించలేకపోయారా అంటూ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారుల ఏమరపాటును నెటిజన్లు ఎండగడుతున్నారు. సైబర్ సెక్యూరిటీ, సేఫ్టీ విధులు వదిలేసి సోషల్ మీడియా యాక్టివిస్టులపై రాజకీయ కక్ష సాధింపు కేసుల పెట్టడం మీద దృష్టి పెడితే.. ఇలాగే అవుతుందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఒక అధికారిక వ్యవస్థను నిర్వహిస్తున్న వారు.. ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉంటారని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం దీనిపై సీఎస్బీ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఇలాంటి హ్యాకింగ్ కేవలం ఫిషింగ్ లేదా సోషల్ ఇంజినీరింగ్ వంటి పద్ధతుల్లో జరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ఫిషింగ్ లింక్‌లు పంపితే.. దానిని ఓపెన్ చేసిన వారి లాగిన్, ఇతర వివరాలు దొంగిలించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ప్రభుత్వ శాఖ సోషల్ మీడియా అకౌంట్లను హ్యాక్ చేయడం అనేది సాధారణంగా సర్వర్ హ్యాకింగ్ కంటే సులభమని మరికొందరు చెబుతున్నారు.
‘స్టేట్ స్పాన్సర్డ్ హ్యాకర్స్’ పనేనా?
సాధారణంగా తమను ఎవరైనా టార్గెట్ చేస్తే.. వారిని టార్గెట్ చేసి, ప్రజల ముందే వారిని జీరోలను చేయాలని హ్యాకర్లకు ఉంటుందని ఐటీ నిపుణులు చెబుతున్నారు. ‘సైబర్ సెక్యూరిటీని కాపాడే సంస్థే తమ ఖాతాను కాపాడుకోలేకపోయింది’ అనే ప్రచారంతో ఆ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం తగ్గించడం కూడా హ్యాకర్ల ఒకానొక ప్రధాన వ్యూహం అయి ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో సైబర్ నేరాలపై విస్తృతంగా ప్రచారం చేస్తున్న సీఎస్బీ ఎక్స్ అకౌంట్‌ను టార్గెట్ చేసి ఉంటారని భావిస్తున్నారు. ఇలా చేయడం వెనుక కొన్నిసార్లు వెనుక పెద్ద ఆర్గనైజ్డ్ గ్రూప్స్ లేదా ఇతర దేశాల మద్దతు ఉన్న హ్యాకర్లు(స్టేట్ స్పాన్సర్డ్ హ్యాకర్స్) ఉంటారని చెబుతున్నారు. వీరు అత్యాధునిక మాల్వేర్లను ఉపయోగించి హ్యాక్ చేస్తారంటున్నా రు. ప్రభుత్వ ఖాతాలను మల్టిపుల్ డివైజ్‌లలో లాగిన్ చేయడం, టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ వంటి అదనపు భద్రతా లేయర్లను ఎనేబుల్ చేయకపోవడం వల్ల హ్యాకర్లకు ఇలాంటి పని మరింత సులభమవుతుందని చెబుతున్నారు. ప్రభుత్వ అధికారిక అకౌంట్ నుంచి ఏదైనా పోస్ట్ వస్తే ప్రజలు దాన్ని నిజమని నమ్ముతారు కాబట్టి.. శాంతిభద్రతలకు విఘాతానికో లేదా ప్రజల్లో గందరగోళం సృష్టించడానికో ఇలా తప్పుడు పోసుల్టు చేస్తారట. చాలా సందర్భాల్లో ప్రభుత్వ వీఐపీ, అధికారిక ఖాతాలను హ్యాక్ చేసి, వాటి ద్వారా క్రిప్టోకరెన్సీ సామ్‌లకు సంబంధించిన లింక్‌లను ప్రమోట్ చేస్తా రు. ప్రజలు అది ప్రభుత్వ లింక్ అనుకొని క్లిక్ చేసి డబ్బులు పోగొట్టుకుంటారు. సైబర్ భద్రతను పర్యవేక్షించే సంస్థలకే ఇలాంటి పరిస్థితి ఎదురుకావడం ప్రమాదమనే అంటున్నారు.
నిర్భయంగా తమ అకౌంట్ల ప్రమోట్
అకౌంట్ హ్యాక్ అయినా అధికారులు స్పందించకపోవడంతో హ్యాకర్లు రెచ్చిపోయారు. నిర్భయంగా తమ అకౌంట్లను, కొన్ని క్రిప్టో అకౌంట్లను ప్రమోట్ చేసుకున్నారు. ఆ వారం రోజుల్లో అవి సరైన లింక్‌లే అనుకొని వాటిని ఎంతమంది క్లిక్ చేశారో? వారి ఇతర అకౌంట్లు ఏమైనా హ్యాక్ అయ్యాయా? అనే విషయాలు తెలియదు. 5 రోజుల్లో 50కిపైగా అకౌంట్లను ప్రమోట్ చేశారు. సీఎస్బీ అకౌంట్ నుంచే చాటింగ్‌లు చేశారు. లాఫింగ్ ఎమోజీలు పెట్టేశారు. ‘ఇంట్రెస్టింగ్ టైమింగ్ ఫర్ దిస్’ అంటూ పోస్టులు చేశారు. ‘పీపుల్ లాఫ్ నౌ ఎఫ్ఓఎంఓ’ అంటూ కామెంట్లు పెట్టారు. ఒక్కో అకౌంట్‌ను పలుమార్లు పోస్టు చేస్తూ, ట్యాగ్ చేస్తూ.. ఇష్టారీతిన వ్యవహరించారు. ఆ వారంలో ప్రమోట్ చేసిన అకౌంట్ల ప్ర స్తుతం ఎక్స్ సెర్చ్ ఇంజిన్‌లో వెతినా దొరుకడం లేదు. తాము చేయాల్సిన పనిచేసి.. ఇవ్వాల్సిన మెసేజ్ ఇచ్చేసి తమ అకౌంట్లు క్లోజ్ చేసి ఉండొచ్చని టెక్ నిపుణులు చెబుతున్నారు.
ప్రమోట్ చేసిన కొన్ని అకౌంట్లు..(ఈ అకౌంట్లను ట్యాగ్ చేస్తూ.. కామెంట్లు చేస్తూ.. లాఫింగ్ ఎమోజీలు పెడుతూ ఒకరకంగా సవాల్ విసిరారు.)