Cyber Crime | హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ) : ‘మీ కొడుకును మేం పట్టుకున్నం.. మాకు డబ్బులు పంపకపోతే కాల్చి చంపేస్తం’ అంటూ సైబర్ నేరగాళ్లు కొత్త పంథాలో బెదిరింపులకు దిగుతూ దోచేస్తున్నారు. లండన్‌లో కొంతకాలంగా జరుగుతున్న అల్లర్లను అడ్డం పెట్టుకొని తాము లండన్ నుంచి ఫోన్ చేస్తున్నామంటూ పాకిస్థాన్ కోడ్‌తో వచ్చే నంబర్లతో వాట్సాప్ కాల్స్ చేస్తూ భయాందోళనలకు గురిచేస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడ ఎలాంటి ఘటనలు జరుగుతున్నా సైబర్‌నేరగాళ్లు వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటూ ఫోన్లు చేస్తూ అందినకాడికి దండుకుంటున్నారు.
తమ పిల్లలు చదువు, ఉద్యోగాల కోసం యూకేకు వెళ్లడంతో నిజంగానే వారు ఆపదలో చిక్కుకున్నారేమోనని తల్లిదండ్రులు భయపడుతూ నేరగాళ్లకు డబ్బు కూడా పంపి మోసపోతున్నారు. ఒకవేళ యూకేలో తమ పిల్లలు లేరని చెబితే ముంబయి, ఢిల్లీ ఇలా ఏదో ఒక ప్రాంతం పేరు చెప్పి ఆందోళన కలిగేలా చేస్తున్నారు. నేరుగా ఫోన్ చేసి బెదిరించే ముఠాలు కొన్నయితే, మరికొన్ని ముఠాలు పోలీస్ దుస్తులు వేసుకొని ‘మేం పోలీసులం మీ పిల్లలను పట్టుకున్నం’ అంటూ వివిధ కేసుల వివరాలు చెబుతూ నమ్మించే ప్రయత్నాలు చేస్తున్నాయి.
ఇలాంటి మోసాలకు పాల్పడుతున్న సైబర్ చీటర్స్ ఎక్కువగా వాట్సాప్ కాల్స్‌తోనే మాట్లాడుతున్నారు. కొన్ని సందర్భాల్లో మొదట సాధారణ కాల్ చేసి డ్రగ్స్, మనీలాండరింగ్ నేరాలు జరిగాయంటూ బెదిరిస్తున్నారు. అలాంటి బెదిరింపులకు భయపడి స్పందిస్తే వెంటనే పోలీస్ అధికారి మాట్లాడుతాడంటూ మాట్లాడిస్తూ ఆందోళన కల్గిస్తున్నారు. ‘మీవాడు కేసుల్లో ఇరుక్కున్నాడు.. మా అదుపులో ఉన్నాడు, డబ్బులివ్వకపోతే కాల్చేస్తాం.. మీ పేరుతో పార్సిల్ ఒకటి వెళ్తుంది.. అందులో మీ ఫోన్ నంబర్ ఉంటుంది.
ఇది డ్రగ్ మాఫియా లింక్‌కు సంబంధముంటుంది.. దావూద్ ఇబ్రహీం గ్యాంగ్‌లతో మీకు సంబంధాలు అంటగడుతం’ అంటూ బెదిరించి డబ్బు వసూలు చేస్తున్నారు. పోలీసులమని చెప్పుకొనే కొందరు వాట్సాప్‌లో వీడియో కాల్స్, స్కైప్ కాల్స్ చేసి ఓవైపు సహాయం చేస్తున్నట్టే నటిస్తూ మరోవైపు ‘మేం ఆర్బీఐ, సీబీఐ, ఎన్ఐఏ వాళ్లం.. మీ బ్యాంకు ఖాతాలు విశ్లేషించాలి.. అందుకు మీ ఖాతాలోని డబ్బు ఆర్బీఐకి పంపించాలి’ అని మోసం చేస్తున్నారు. అనుమానాస్పద నంబర్లు, ఇతర దేశాల కోడ్లతో వచ్చే కాల్స్‌కు ఎవరూ బెదిరిపోవద్దని సైబర్‌క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు.
మీ పిల్లలు డ్రగ్స్‌తో పట్టుబడ్డరు
భైంసా టౌన్, ఆగస్టు 11 : ‘మేం సీబీఐ పోలీసు లం. మీ పిల్లలు డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడ్డరు. డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలి’ అంటూ కొన్ని రోజులుగా నిర్మల్ జిల్లా భైంసా పట్టణంతో పాటు మండలంలోని పలువురికి సీబీఐ పోలీస్ పేరిట వాట్సాప్ కాల్స్ వస్తున్నాయి. ఈ క్రమంలో శనివారం మండలంలోని ఇలేగాంకు చెందిన వెంకటేశ్ కాంబ్లేకు ‘నీ కూతురు డ్రగ్స్ అమ్ముతూ దొరికింది. పది నిమిషాల్లో మా దగ్గరికి రావాలి’ అని గుర్తుతెలియని వ్యక్తులు కాల్ చేశారు.
ఆందోళనకు గురైన వెంకటేశ్ కాంబ్లే పాఠశాలకు వెళ్లి చూడగా అమ్మాయి క్షేమంగానే ఉన్నదని తెలుసుకొని ఊపిరి పీల్చుకున్నాడు. పట్టణంలోని భట్టిగల్లీకి చెందిన ఓ వ్యక్తికి కూడా ఫోన్ రాగా అతను డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారమిచ్చాడు. విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని వారి పేరు, తండ్రి పేరు, ఫోన్ నంబర్, ఊరి పేరు చెబుతూ ఫోన్ కాల్స్ చేస్తున్నారు.