Vemula Veeresham | నకిరేకల్, మార్చి 5 : నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశానికి మంగళవారం అర్ధరాత్రి మధ్యప్రదేశ్ నుంచి సైబర్ నేరగాళ్లు న్యూడ్ కాల్ చేశారు. వాట్సాప్‌లో తెలియని నంబర్ నుంచి వీడియో కాల్ రావడంతో కాల్ లిఫ్ట్ చేయగా, అవతలి వైపు నుంచి ఒకరు నగ్నంగా కనిపిస్తూ స్క్రీన్ రికార్డింగ్ చేశారు. అనంతరం ఆ వీడియోను ఎమ్మెల్యే వీరేశం వాట్సాప్‌కు పంపి డబ్బులు పంపించాలని బ్లాక్ మెయిల్ చేశారు. ఆయన స్పందించకపోవడంతో అదే వీడియోను వీరేశం కాంటాక్ట్స్‌లో ఉన్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు పంపారు.
వాళ్లంతా ఎమ్మెల్యేకు ఫోన్ చేసి విషయం చెప్పడంతో ఆయన షాక్ తిన్నాడు. వెంటనే నకిరేకల్ టౌన్ సీఐ రాజశేఖర్‌కు ఫిర్యాదు చేశారు. సైబర్ సెల్ ద్వారా ఆయన సైబర్ క్రిమినల్ నంబర్‌ను బ్లాక్ చేయించారు. బుధవారం నకిరేకల్ పట్టణంలో ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. వీఐపీలు టార్గెట్‌గా సైబర్ నేరగాళ్లు బ్లాక్ మెయిల్ దందాకు దిగుతున్నారని, ఇలాంటి వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. సైబర్ నేరగాళ్ల నుంచి వీడియో కాల్స్ వస్తే ఎవరూ ఎత్తవద్దని సూచించారు. అనుమానాస్పద కాల్స్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయాలని తెలిపారు.