Cyber Crime | హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): సైబర్ నేరగాళ్ల కన్ను ఇప్పుడు విద్యుత్తు వినియోగదారులపై పడింది. పెండింగులో ఉన్న బిల్లులు చెల్లించాలంటూ ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ జీ రఘుమారెడ్డి శనివారం ఒక ప్రకటనలో సూచించారు. ఇలాంటి కేసుల్లో ఇప్పటికే పలువురు వినియోగదారులు లక్షలాది రూపాయల మేర మోసపోయినట్టు తనకు సమాచారం అందినట్టు పేర్కొన్నారు. ఫోన్లకు వచ్చే సందేశాలను నమ్మవద్దని సూచించారు.
ఈ విషయంలో ఏమైనా అనుమానాలు ఉంటే నేరుగా సంస్థ కస్టమర్ కేర్, స్థానిక సెక్షన్ కార్యాలయంలో అధికారులను నేరుగా సంప్రదించాలని సూచించారు. బిల్లులను ఆన్లైన్లోనే చెల్లించాలని విద్యుత్తుశాఖ నుంచి ఎవరూ అడగరని, అలా ఎవరైనా అడిగితే నమ్మవద్దని కోరారు. పెండింగు బిల్లు చెల్లించకుంటే కనెక్షన్ కట్ చేస్తామంటూ ఫోన్లలో వచ్చే సందేశాలను పట్టించుకోవద్దని, మోసపూరిత సందేశాలు పంపుతున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. కొందరు నేరగాళ్లు బ్యాంకు ఖాతా, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు వివరాలను సేకరించి వినియోగదారుల అకౌంట్ల నుంచి అక్రమంగా విత్డ్రా చేస్తున్నారని, ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.
విద్యుత్తు ఉద్యోగులు చెల్లింపు రసీదు బిల్లు మినహా ఇతర వివరాలు ఏమీ అడగరని, అలాంటి సమాచారాన్ని ఉద్యోగులు సేకరించరని తెలిపారు. బిల్లుల చెల్లింపుల కోసం వెబ్సైట్, ఎస్ఎంఎస్ సందేశాన్ని సంస్థ పంపదని, బిల్లుల ద్వారానే ప్రస్తుత నెల బిల్లులు, అందులోనే గత బకాయిల వివరాలను వినియోగదారులకు తెలియజేస్తున్నదని రఘుమారెడ్డి వివరించారు. పెండింగ్ బిల్లులు ఉంటే రాత్రి పూట విద్యుత్తు సరఫరాను నిలిపివేయదని, అలా ఎవరైనా చెబితే అది మోసంగానే గుర్తించాలని సూచించారు. ఫోన్లలో వచ్చే అనుమానాస్పద లింకులపై క్లిక్ చేయవద్దని సూచించారు.