హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 29(నమస్తే తెలంగాణ): సినిమా ఇండస్ట్రీకి పెనుసవాల్‌గా మారిన పైరసీ (Movie Piracy) ముఠాను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. దేశంలోనే అతిపెద్ద ముఠాను ఛేదించి ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. వీరికి సహకరించినందుకు మరో ఐదుగురికి నోటీసులు జారీ చేసినట్టు తెలిపారు. ఈ ముఠా తెలుగుతోపాటు ఇతర భాషల చిత్రాలను కూడా పైరసీ చేస్తున్నట్టు చెప్పారు. సోమవారం బంజారాహిల్స్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పైరసీ వివరాలను సీవీ ఆనంద్ వెల్లడించారు. కుబేరా, హరిహరవీరమల్లు, సింగిల్, హిట్ వంటి సినిమాల పైరసీపై పోలీసులకు అందిన ఫిర్యాదులపై సమగ్రంగా దర్యాప్తు చేపట్టి, ఈ మేరకు అరెస్టులు చేశామని పేర్కొన్నారు.
దర్యాప్తులో భాగంగా 44మంది అనుమానితులను విచారించిన తర్వాత నిందితుడు వనస్థలిపురానికి చెందిన కిరణ్‌గా గుర్తించి అతనిని జూలై 3న అరెస్ట్ చేశామని తెలిపారు. కిరణ్‌ను కస్టడీలోకి తీసుకుని విచారించగా పైరసీ ముఠా సభ్యులు దుబయ్, నెదర్లాండ్, మయన్మార్‌లో ఉన్నట్టు గుర్తించామని వివరించారు. పైరసీ చేసిన హెచ్డీ కాపీలు తమిళ్ బ్లాస్టర్స్, మూవీరూల్స్, తమిళ్ఎంవీ సైట్లలో ఉన్నాయని, ప్రాథమికంగా ఫోరెన్సిక్ వాటర్‌మార్కింగ్ ఫలితాలను బట్టి ఈ లీకేజ్ థియేటర్లలో జరిగినట్టు గుర్తించామని చెప్పారు.
నిందితులు వీరే..!
తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్‌కు చెందిన యాంటీ వీడియో పైరసీ సెల్ నుంచి వచ్చిన ఫిర్యాదుతో బృందాలను ఏర్పాటు చేసి విచారణ చేపట్టామని సీవీ ఆనంద్ తెలిపారు. సర్వర్స్ హ్యాకింగ్తోపాటు క్యామ్‌కార్డర్ ద్వారా నిందితులు సినిమాలను పైరసీ చేస్తున్నట్టు గుర్తించామని చెప్పారు. ముఠాలో సభ్యులైన బీహార్‌కు చెందిన అశ్వనీకుమార్, తమిళనాడుకు చెందిన సిరిల్ ఇన్ఫంట్ రాజ్, సుధాకరన్, హైదరాబాద్‌కు చెందిన జానా కిరణ్‌కుమార్, నార్త్గోవాకు చెందిన, ప్రస్తుతం బీహార్‌లో ఉంటున్న అర్సలన్ అహ్మద్ అనే వ్యక్తులను అరెస్ట్ చేశామని వివరించారు. వీరంతా తమిళ్‌బ్లాస్టర్స్, ఫైవ్మూవీ రూల్స్, తమిళ్మూవీ వెబ్సైట్లలో పైరసీ సినిమాలను పెడుతున్నారని చెప్పారు. కరూర్‌కు చెందిన సిరిల్ ప్రధాన నిందితుడు కాగా ఇతను 2020 నుంచి నాలుగు వెబ్సైట్లు నడుపుతున్నాడని సీపీ తెలిపారు. కంప్యూటర్సైన్స్లో ఇంజనీరింగ్చేసి ఈజీమనీకి అలవాటుపడిన సిరిల్.. ఏజెంట్లను నియమించుకుని అన్ని భాషల సినిమాలను పైరసీ చేశాడని సీపీ వెల్లడించారు.
పైరసీ కోసం పకడ్బందీ ప్లాన్
థియేటర్లలో ప్లే అయ్యే శాటిలైట్ కంటెంట్ ఐడీని, పాస్‌వర్డ్‌లను హ్యాక్ చేస్తున్నారని, హ్యాక్ అవ్వకపోతే ఏజెంట్లకు కెమెరాలు అందజేసి, రహస్యంగా రికార్డ్ చేయిస్తున్నారని సీపీ సీవీ ఆనంద్ చెప్పారు. పాప్కాన్ డబ్బా, కోక్టిన్, షర్ట్ జేబులో కెమెరాలు, సెల్ఫోన్లను పెట్టి సినిమాను చిత్రీకరిస్తున్నారని తెలిపారు. ఏడాదిన్నరలో జానా కిరణ్ అనే నిందితుడు 40 సినిమాలను సినిమా రిలీజ్ రోజునే పైరసీ చేసి లీక్ చేశాడని తెలిపారు. ప్రతీ సినిమాకు 300 నుంచి 400 డాలర్లు బిట్‌కాయిన్స్ రూపంలో తీసుకుంటున్నారని చెప్పారు. ఈటీవీ విన్ కంటెంట్‌ను పైరసీ చేసి అమ్ముకున్న మరో నిందితుడిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
నిరుడు పెచ్చుమీరిన పైరసీతో సినిమా ఇండస్ట్రీకి సుమారు 22,400 కోట్ల నష్టం వాటిల్లగా ఒక్క తెలుగు ఇండస్ట్రీకి సుమారు రూ.3700 కోట్ల నష్టం జరిగిందని సీవీ ఆనంద్ తెలిపారు. పైరసీ ముఠా అరెస్ట్‌తో అన్ని భాషల సినీ పరిశ్రమలకు ఊరట లభిస్తుందని చెప్పారు. విదేశాల్లో ఉంటూ అక్కడి సర్వర్ల ద్వారా పైరసీ చేస్తున్న వారిని పట్టుకునేందుకు మార్గాలను అన్వేషించాలని, అప్పుడే పైరసీకి అడ్డుకట్ట పడుతుందని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ఈ కేసు దర్యాప్తులో కీలకపాత్ర పోషించిన హైదరాబాద్ సైబర్‌క్రైమ్ ఇన్స్పెక్టర్లు నరేశ్, సతీశ్‌రెడ్డి, దిలీప్‌కుమార్, మధుసూదన్‌రావు, ఎస్ఐలు సురేశ్, మన్మోహన్గౌడ్, మహిపాల్‌ను అభినందించారు. ఈ సమావేశంలో సీపీతో పాటు పాటు క్రైమ్స్ అడిషనల్ సీపీ విశ్వప్రసాద్, సైబర్ క్రైమ్స్ డీసీపీ దారా కవిత తదితరులు పాల్గొన్నారు.