హైదరాబాద్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ) : కొత్త నియామకాల్లేవు.. జాబ్ క్యాలెండర్ అటకెక్కింది.. ఒక్క నోటిఫికేషన్ ఇచ్చింది లేదు.. కానీ ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టేందుకు కాంగ్రెస్ సర్కారు కుట్రలకు పాల్పడుతున్నది. అరకొర వేతనంతో కాలం వెళ్లదీసే ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించేందుకు పావులు కదుపుతున్నది. 25-30 వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు సమాచారం. ఇందుకు పీఆర్సీ చైర్మన్ శివశంకర్, జీఏడీ కార్యదర్శి రఘునందన్‌రావు, ఆర్థికశాఖ డిప్యూటీ సెక్రటరీ నాగేశ్వర్రావుతో కమిటీ వేసినట్టు తెలిసింది.
ఈ కమిటీ రాష్ట్రంలో 4.94 లక్షల మంది కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల పనితీరు, ఏజెన్సీలపై అధ్యయనం చేసి, 30 రోజుల్లో నివేదిక అందించనున్నది. ఇటీవల 54 వేల పైచిలుకు ఉద్యోగాలను కొత్తగా భర్తీచేయగా, వీరికి పలు శాఖల్లో పోస్టింగ్స్ ఇచ్చారు. జేఎల్స్‌కు పోస్టింగ్ ఇచ్చారు. ఆయా స్థానాల్లో పనిచేస్తున్న 25-30వేల మందిపై సర్కారు వేటు వేయబోతున్నది. దీంతో వారు దిన దిన గండంగా గడుపుతున్నారు. కొత్త జిల్లాలు, మండలాల ఏర్పాటుతోపాటు ఇటీవల కొత్తగా కాలేజీలు మంజూరుచేశారు. వీటికి ఎలాగు కొత్తపోస్టులు మంజూరుచేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఉన్నవారిని తొలగించడానికి బదులు, వారిని ఆయా స్థానాల్లో నియమించాలని ఔట్ సోర్సింగ్ ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.