హైదరాబాద్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో పారిశ్రామిక రంగం పడకేసి.. ఉత్పాదక రంగం అనేక అవస్థలు పడుతున్న తరుణంలో ఈ రంగంపై రూ.1,025 కోట్ల భారం మోపేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. హైటెన్షన్ (హెచ్‌టీ) వినియోగదారులకు రాత్రిపూట ఇచ్చే ఇన్సెంటివ్లో కోత పెట్టనున్నది. హెచ్‌టీ వినియోగదారులకు సరఫరా చేసే ఒక్కో యూనిట్ విద్యుత్తుకు రూ.1.50 చొప్పున కట్ చేయనున్నది. ఏకంగా 16 వేలకు పైగా పరిశ్రమలపై ఏటా రూ.1,025 కోట్ల అదనపు భారాన్ని రుద్దనున్నది. ఈ మేరకు హెచ్‌టీ వినియోగదారులపై దక్షిణ డిస్కం రూ.914.7 కోట్లు, ఉత్తర డిస్కం 110.4 కోట్ల చొప్పున భారం వేయనున్నాయి.
హెచ్‌టీ వినియోగదారులు రాత్రిపూట విద్యుత్తు వినియోగించుకున్నందుకు అందిం చే అలవెన్స్‌కు కోతపై ఇప్పటికే డిస్కంలు తెలంగాణ విద్యుత్తు నియంత్రణ మండలి (ఈఆర్సీ) ముందు పిటిషన్లు సమర్పించాయి. వీటిపై ఇప్పటికే విచారణ పూర్తయ్యింది. ఈఆర్సీ కేవలం ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉన్నది. అంతలోనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోడ్‌తో అవి నిలిచిపోయాయి. కోడ్ ముగియగానే ఉత్తర్వులు వెలువడతాయని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. 11 కేవీ, 33 కేవీ, 132 కేవీ కనెక్షన్లను హెచ్‌టీ పరిధిలోకి తీసుకుంటారు. ఫార్మా, ఐరన్ వంటి భారీ పరిశ్రమలు, ఐటీ కంపెనీలు, ఎయిర్‌పోర్టులు, వాణిజ్య సముదాయాలు, ఈవీ చార్జింగ్ స్టేషన్లు, బస్స్టేషన్లు, రైల్వేస్టేషన్లు, రైస్‌మిల్లులు హెచ్‌టీ కనెక్షన్లు తీసుకుంటాయి. 440 ఓల్టుల విద్యుత్తును డిస్కంలు సరఫరా చేస్తాయి.
రాష్ట్రంలో విద్యుత్తు పంపిణీ సంస్థల ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగాలేదు. అప్పులు, బకాయిలు పేరుకుపోతున్నాయి. వడ్డీల భారంతో డిస్కంల నడ్డి విరుగుతున్నది. ఈ తరుణంలో సర్కారు సబ్సిడీ మొత్తం తప్ప అదనపు నిధులు ఇవ్వడంలేదు. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడంలేదు. దీంతో డిస్కంల క్రెడిట్ రేటింగ్ పడిపోతున్నది. విత్త సంస్థలు రుణాలిచ్చేందుకు ముందుకు రావడంలేదు. పైగా అధిక వడ్డీలు రుద్దుతున్నాయి.
సర్కారు సైతం సబ్సిడీ మొత్తాన్ని ఆలస్యంగా ఇస్తున్నది. దీంతో ఈ ఏడాది సెప్టెంబర్‌లో విద్యుత్తు ఉద్యోగులకు జీతాలు కూడా 10 రోజులు ఆలస్యంగా ఇవ్వాల్సి వచ్చింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.13,500 కోట్లను సర్కారు సబ్సిడీగా ఇవ్వాల్సి ఉన్నది. గృహ జ్యోతి పథకం సబ్సిడీలను సైతం చెల్లించాలి. గృహజ్యోతివి రూ.600 కోట్లు, సబ్సిడీలు రూ. 3,100 కోట్ల చొప్పున రూ. 3,700 కోట్ల దాకా సర్కారు బకాయిపడ్డది. సర్కారు ఇవ్వకపోవడంతో అదనపు ఆదాయ మార్గాలను అధికారులు అన్వేషిస్తున్నారు. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు సబ్సిడీలకు కోత పెడుతున్నారన్న విమర్శలున్నాయి.
10-15 ఏండ్ల క్రితం విద్యుత్తుకు అధిక డిమాండ్ ఉండేది. స్థాపిత విద్యుత్తు సామర్థ్యం తక్కువగా ఉండటం, డిమాండ్ అధికంగా ఉండటంతో విద్యుత్తు కొరత సమస్యలుండేవి. దీంతో పగటి పూట ఇతర రంగాలు, రాత్రిపూట పారిశ్రామికరంగం విద్యుత్తు వాడుకునేలా సంస్కరించారు.