భీమారం, మే 25 : ‘మా తండ్రి మరణిస్తే ఊరికెళ్లాము అధ్యక్షా. దహన సంస్కారాలయ్యాక స్నానం చేసే ఇంటికి పోవాలి. నాకున్న పరిచయాలతో కరెంట్ ఏపిచ్చుకుని బోరు ఆన్‌చేస్తే లోఓల్టేజీతో అది నీళ్లు పోస్తలేదు. నెత్తిమీద నీళ్లు చల్లుకుని ఇంటికి వచ్చినం’ ఈ మాటలన్నది ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి. టీడీపీ ఎమ్మెల్యేగా ఉమ్మడి రాష్ట్రంలో కరెంట్ కష్టాలపై అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలివి. అలాంటి కష్టాన్ని స్వయంగా అనుభవించిన రేవంత్‌రెడ్డి సీఎంగా ఉన్న సమయంలోనే ఓ సామాన్యుడికి సైతం అదే చేదు అనుభవం ఎదురైంది.
కన్నతల్లి కన్నుమూసిన దుఃఖాన్ని దిగమింగుకుని.. అంతిమసంస్కారాలు పూర్తి చేయాలనుకున్న కొడుకుకు కరెంట్ కోతలు తిప్పలు పెట్టాయి. కన్నుమూసిన తల్లిని పక్కన పెట్టుకుని కరెంట్ కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. పుట్టెడు దుఃఖంలోనూ కరెంటోళ్లకు ఫోన్ చేస్తే కరెంట్ రాదని కరాఖండిగా చెప్పడంతో గంట తర్వాత 20 లీటర్ల మినరల్ వాటర్ బాటిల్ తెప్పించుకుని అంతిమకార్యం పూర్తి చేయాల్సి వచ్చింది. అంత్యక్రియలకు హాజరైన కుటుంబసభ్యులు, బంధువులకు కిలోమీటర్ కాలినడక తరువాత మిషన్ భగీరథ నల్లా నీళ్లే స్నానానికి అక్కరకు వచ్చాయి. ఈ ఘటన మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రంలో శనివారం జరుగగా, అంత్యక్రియలకు హాజరైన వాళ్లంతా సర్కారుకు శాపనార్థాలు పెట్టడం కనిపించింది. భీమారం మండల కేంద్రంలోని బీసీ కాలనీకి చెందిన కుమ్మరి శంకరమ్మ (58) శుక్రవారం రాత్రి 10 గంటలకు చనిపోయింది. శనివారం ఉదయం 11 గంటలకు అంతిమయాత్ర నిర్వహిస్తూ ఊరి శివారుకు చేరుకున్నారు.
తన తల్లికి తలకొరివి పెట్టే క్రమంలో కుమారుడు స్నానం చేయాల్సి ఉండగా, బోరు బావి వద్దకు చేరుకున్నాడు. ఆ సమయంలో కరెంట్ లేక బోర్లు పోయలేదు. అరగంట పాటు ఎదురుచూసి చివరకు విద్యుత్ అధికారులకు ఫోన్ చేయగా, మధ్యాహ్నం 12 గంటల దాకా కరెంట్ రాదని చెప్పారు. దీంతో చేసేదేమీ లేక అప్పటికప్పుడు 20 లీటర్ల మినరల్ వాటర్ తెప్పించగా, వాటితో రమేశ్ స్నానం చేశాడు. అనంతరం తలకొరివి పెట్టాడు. ఆపై కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులు అక్కడి నుంచి కిలోమీటర్ దూరం వరకు నడిచి కట్టె డిపో వద్ద ఉన్న మిషన్ భగీరథ నల్లా కింద స్నానం చేసి ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. కేసీఆర్ సర్కారులో ఇలాంటి పరిస్థితులను చూడలేదని, రేవంత్ సర్కారు పదేళ్ల కిందటి కాంగ్రెస్ పాలనను గుర్తు చేస్తుందని అంత్యక్రియలకు హాజరైనవారంతా మండిపడ్డారు.