ఏడు కుటుంబాలకు ఏడాదంతా ఉపాధి
కాలేజీ విద్యార్థులకూ ‘ఆరుతడి’పై అవగాహన
సూర్యాపేట, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): ఆరుతడి, ఉద్యాన పంటలు పండిస్తున్న ఓ ఉపాధ్యాయుడు.. విద్యార్థులకు కూడా వాటిపై అవగాహన కల్పిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. తల్లిదండ్రులను ప్రోత్సహించేలా విద్యార్థులకు పంటలపై పాఠాలు బోధిస్తున్నారు. సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండలం సింగిరెడ్డిపాలెంలో తీకుళ్ల శ్రీనివాస్‌రెడ్డికి 18 ఎకరాల భూమి ఉన్నది. ఆ భూమిలో మొత్తం కూరగాయలు, ఆరుతడి పంటలే సాగు చేస్తున్నారు. మామిడి, జామ, బత్తాయి వంటి పండ్ల తోటలు, మినుములు, కందులు, పెసలు, వేరుశనగ, టమాట, వంగ, బెండ, సొరకాయ, మిర్చి తదితర కూరగాయలను పండిస్తున్నారు. మొత్తంగా ఆ భూమిలో 20 రకాల పంటలను వేశారు. ఆయనకు సూర్యాపేటలో ఓ డిగ్రీ కాలేజీ ఉన్నది. అక్కడ చదువుకొనే విద్యార్థులకు ఆయన పంటల సాగుపై సలహాలు ఇస్తున్నారు. వరి కాకుండా ఇతర పంటలు వేయటం వల్ల లాభాలు ఎలా వచ్చాయి? ధాన్యం అమ్ముకోవడానికి రైతులు పడుతున్న కష్టాన్ని విద్యార్థులకు వివరిస్తున్నారు. ఇతర పంటల సాగుతో శ్రీనివాస్‌రెడ్డి.. చాలా కుటుంబాలకు ఉపాధి కూడా కల్పిస్తున్నారు. నెలనెలా వేతనంతో ఏడు కుటుంబాలకు ఏడాదంతా ఉపాధి కల్పిస్తుండగా, మరో 15 నుంచి 20 మంది కూలీలకు 150 రోజుల పాటు పని కల్పిస్తున్నారు.
18 ఎకరాల్లో వేసిన పంటలు ఇవీ..
టమాట, చిక్కుడు, గోరుచిక్కుడు, పుచ్చకాయ, పాలకూర, చుక్కకూర, మెంతికూర, కొత్తిమీర, పుదీనా కలిపి మూడెకరాలు. మిర్చి మూడెకరాలు, దోస రెండెకరాలు, బెండ రెండెకరాలు, మినుములు రెండెకరాలు, కంది రెండెకరాలు, వేరుశనగ 1 ఎకరం, పుచ్చ 1 ఎకరం, మామిడి, జామ, బత్తాయి ఇతర పండ్లు రెండెకరాలు
కాలేజీలో రోజూ అరగంట పాఠాలు
నాకున్న 18 ఎకరాల్లో పదేండ్లుగా పదెకరాల్లో వరి, మిగిలిన భూమిలో ఇతర పంటలు వేస్తూ వచ్చాను. వరి కంటే ఇతర పంటలతోనే అధిక లాభాలు వస్తున్నాయి. గతేడాది ఎకరంలో మిర్చి వేస్తే రూ.నాలుగున్నర లక్షల లాభం వచ్చింది.