వరంగల్, మే 28(నమస్తేతెలంగాణ)/ ఫర్టిలైజర్‌సిటీ: ఉల్లిగడ్డల బస్తాల కింద నకిలీ పత్తి విత్తనాలు తరలిస్తున్న వ్యాన్‌ను చెన్నూర్‌లో పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రూ.16.50 లక్షల విలువైన 5.50 క్వింటాళ్ల నిషేధిత బీటీ-3 విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. కాగా వరంగల్‌లో అక్రమంగా నిల్వ ఉంచిన రూ.3.67 లక్షల విలువైన పత్తి విత్తన ప్యాకెట్లను సీజ్‌చేశారు. వివరాలు ఇలా.. చెనూర్కు సంబంధించి రామగుండం పోలీస్ కమిషనరేట్‌లో సీపీ శ్రీనివాస్ మంగళవారం వెల్లడించిన వివరాల ప్రకారం.. కర్ణాటకలో విత్తనాలు కొనుగోలు చేసి మహారాష్ట్ర నుంచి రామగుండం పోలీసు కమిషనరేట్ మీదుగా కొంతమంది నిషేధిత బీటీ-3 నకిలీ పత్తి విత్తనాలను అక్రమంగా రవాణా చేస్తున్నారు.
సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ సంజయ్, ఎస్సై లచ్చన్న సిబ్బందితో కలిసి మంగళవారం మంచిర్యాల్ జోన్‌లోని చెన్నూరు పరిధిలో గల బతుకమ్మ వాగు వద్ద తనిఖీలు చేపట్టారు. ఓ వ్యాన్ ఆపి తనిఖీ చేయగా అందులో ఉల్లిగడ్డ బస్తాల కింద దాదాపు రూ.16.50 లక్షల విలువైన 5.5 క్వింటాళ్ల నిషేధిత బీటీ-3 విత్తనాలు బయటపడ్డాయి. అందులో ఉన్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్టు సీపీ తెలిపారు.

వరంగల్‌లోని విత్తన దుకాణాలపై వ్యవసాయశాఖ, పోలీసు టాస్క్‌ఫోర్స్ అధికారులు మంగళవారం ఆకస్మిక దాడులు జరిపారు. ఎమ్మార్పీ కంటే ఎక్కువకు అమ్మేందుకు విత్తన డీలర్లు అక్రమంగా నిల్వ చేసిన రూ.3,67,100 విలువ గల పత్తి విత్తన ప్యాకెట్లను సీజ్ చేశారు. వరంగల్ స్టేషన్ రోడ్డులోని ఓల్డ్ గ్రెయిన్ మార్కెట్ ప్రాంతంలోని రఘురామ సీడ్స్ అండ్ ఫర్టిలైజర్స్ దుకాణంలో సరైన బిల్లులు, రికార్డులు చూపకుండా అక్రమంగా నిల్వ చేసిన రూ.2,72,160 విలువ గల యూఎస్ 7067 అనే బ్రాండ్‌కు చెందిన 315 పత్తి విత్తనాల ప్యాకెట్లను గుర్తించారు.
వరంగల్ ఫోర్ట్‌రోడ్డులోని ఏకశిలనగర్‌లో మేరీమాత సీడ్స్ అండ్ ఫర్టిలైజర్స్ దుకాణం యజమాని అల్లం విజయభాస్కర్‌రెడ్డి ఇంటి ఆవరణలో రూ.31,968 విలువ గల వివిధ బ్రాండ్లకు చెందిన 37 పత్తి విత్తన ప్యాకెట్లను, ఖిలావరంగల్ మండలం బొల్లికుంట రామకృష్ణాపురంలోని మహాలక్ష్మి సీడ్స్, ఫర్టిలైజర్ దుకాణం యజమాని మల్లిపెద్ది దేవకుమార్ ఇంటి ఆవరణలో రూ.63,072 విలువ గల 73 పత్తి విత్తన ప్యాకెట్లను సీజ్ చేశారు.