Telangana | హైదరాబాద్, అక్టోబర్ 6(నమస్తే తెలంగాణ): పదేండ్లలో తెలంగాణ వ్యవసాయం పండుగైంది. రైతులను ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం అమలు చేసిన రైతు సంక్షేమ పథకాలు సత్ఫలితాలనిచ్చాయి. ఉచిత విద్యుత్తు, రైతుబంధు, రైతుబీమా, ధాన్యం కొనుగోలు, రుణమాఫీ, ఉచిత చేప పిల్లల పంపిణీ, గొర్రెల పంపిణీ వంటి పథకాలతో తెలంగాణలో వ్యవసాయరంగం రూపురేఖలు మారిపోయాయి. స్వరాష్ట్రంలో సాగు విస్తీర్ణం 81%, పంట ఉత్పత్తులు 145% పెరగడం పదేండ్ల ప్రగతికి అద్దంపడుతున్నది. దశాబ్ది కాలంలో తెలంగాణ వ్యవసాయరంగం సాధించిన ప్రగతిపై ఆ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి శుక్రవారం ప్రత్యేక నివేదిక విడుదల చేశారు. ఈ నివేదికలోని ముఖ్యాంశాలు
సాగునీటి ప్రాజెక్టులు
సాగునీటి గోస తీర్చి వ్యవసాయాన్ని పండుగ చేసేందుకు సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి పెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్.. తొలుత ‘కాళేశ్వరం ప్రాజెక్ట్’ను పూర్తిచేశారు. దీనికితోడు దక్షిణ తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును చేపట్టారు. ఈ రెండు ప్రాజెక్టులు రాష్ట్ర వ్యవసాయరంగానికి జీవనాడిగా నిలిచాయి. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి, చెరువులను బాగు చేశారు. తద్వారా రాష్ట్రంలో సాగునీటి గోస తీరడంతోపాటు భూగర్భ జలాలు పెరిగాయి.
రుణమాఫీ మాట నిలుపుకున్న ప్రభుత్వం
రైతులను రుణవిముక్తి చేయాలన్న సంకల్పంతో సీఎం కేసీఆర్ పంట రుణాల మాఫీకి శ్రీకారం చుట్టారు. 2014 ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా రూ.లక్ష రుణం గల 40.74 లక్షల మంది రైతులకు చెందిన రూ.17,351 కోట్ల రుణాలను ప్రభుత్వం పూర్తిగా మాఫీ చేసింది. 2018లో మరోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి విడతలో 5.41 లక్షల మంది రైతులకు చెందిన రూ.1,198 కోట్ల రుణాలను మాఫీ చేసింది. రెండో విడతలో రుణమాఫీ కోసం రూ.18,242 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఇప్పటికే 22.46 లక్షల మంది రైతులకు చెందిన రూ.12,617 కోట్ల రుణాలను మాఫీ చేసింది. ప్రస్తుతం రుణమాఫీ ప్రక్రియ జరుగుతున్నది.
రైతుబంధు సాయం 72,815 కోట్లు
రైతులకు పెట్టుబడి కష్టాలు తీర్చాలన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ 2018లో రైతుబంధు పథకానికి శ్రీకారం చుట్టారు. ఏటా 65 నుంచి 69 లక్షల మంది రైతులకు ఎకరాకు ఏడాదికి రూ.10 వేల చొప్పున పెట్టుబడి సాయం అందుతున్నది. ఈ పథకం కింద ఇప్పటివరకు రూ.72,815 కోట్లు రైతుల ఖాతాల్లో జమ అయింది.
లక్షకు పైగా కుటుంబాలను కాపాడిన రైతుబీమా
కారణం ఏదైనా సరే రైతు మరణిస్తే, ఆ రైతు కుటుంబం రోడ్డున పడొద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం రైతుబీమా పథకాన్ని అమలు చేస్తున్నది. మరణించిన రైతు కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం అందిస్తున్నది. ఈ పథకం కింద ఇప్పటివరకు 1,11,154 రైతు కుటుంబాలకు రూ.5,566 కోట్లు అందించి ఆర్థికంగా అండగా నిలిచింది.
ఉచిత విద్యుత్తుకు ఏటా 12 వేల కోట్లు
వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు అందించేందుకు ప్రభుత్వం ఏటా సుమారు రూ.12 వేల కోట్లు వెచ్చిస్తున్నది. ఇంత భారీ మొత్తంలో ఖర్చు చేస్తూ 24 గంటలపాటు నాణ్యమైన ఉచిత విద్యుత్తు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 8.47 కొత్త వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్ల సంఖ్య 27.49 లక్షలకు చేరింది.
తెలంగాణ వ్యవసాయరంగంలో ఐదు విప్లవాలు
గ్రీన్ రివల్యూషన్: స్వరాష్ట్రంలో వరితోపాటు ఇతర పంటల సాగు విస్తీర్ణం పెరిగింది. ప్రస్తుతం వరి సాగు విస్తీర్ణం 121 లక్షల ఎకరాలు కాగా ధాన్యం ఉత్పత్తి 262 లక్షల టన్నులకు పెరిగింది. 2015-16తో పోల్చి తే ధాన్యం ఉత్పత్తి 400% పెరిగింది.
వైట్ రివల్యూషన్: రాష్ట్ర ప్రభుత్వం పాడి పరిశ్రమను, పాడి రైతులను ప్రొత్సహించడంతో పాల ఉత్పత్తి భారీగా పెరిగింది. 2014-15లో 42 లక్షల టన్నుల పాలు ఉత్పత్తి కాగా ప్రస్తుతం 58 లక్షల టన్నులకు పెరిగి 38% పెరుగుదల నమోదైంది. పాడి రైతులకు దేశంలో మరెక్కడా లేని విధంగా లీటరుకు రూ.4 ప్రోత్సాహకం అందిస్తున్నది. ఈ మేరకు 300 కోట్లు రైతులకు ఇచ్చింది.
పింక్ రివల్యూషన్: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గొర్రెల పంపిణీ పథకం పింక్ రివల్యూషన్ సృష్టించింది. గొర్రెల సంఖ్యలో తెలంగాణ దేశంలోనే నంబర్ 1 స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో 1.91 కోట్ల గొర్రెలు ఉన్నాయి. ఈ పథకంతో గొర్రెల సంఖ్య 48.51% పెరిగింది. 10.04 లక్షల టన్నుల మాంసం ఉత్పత్తితో దేశంలో 5వ స్థానంలో నిలిచింది.
బ్లూ రివల్యూషన్: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉచిత చేపపిల్లల పంపిణీతో రాష్ట్రంలో నీలి విప్లవం ఆవిష్కృతమైంది. చేపల ఉత్పత్తి 2.68 లక్షల టన్నుల నుంచి 3.90 లక్షల టన్నులకు పెరిగింది. చేపల ఉత్పత్తి విలువ రూ.2,637 కోట్ల నుంచి రూ.5,960 కోట్లకు పెరిగింది.
ఎల్లో రివల్యూషన్: ఆయిల్‌పాం సాగులో ఎల్లో విప్లవానికి దారితీసింది. మొత్తం 20 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పాం సాగు కోసం ప్రణాళిక రూపొందించింది. ఇప్పటివరకు 1.7 లక్షల ఎకరాల్లో సాగు పెరిగింది.
రైతు వేదికలకు 572 కోట్లు
రైతులను సంఘటితం చేయాలన్న ఉద్దేశంతో రైతు వేదికలను ప్రభుత్వం నిర్మించింది. ప్రతి ఐదు వేల ఎకరాలకు ఒక క్లస్టర్‌ను ఏర్పాటు చేసి ప్రతి క్లస్టర్‌కు ఒక ఏఈవోను నియమించింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ.572 కోట్లతో 2,601 రైతు వేదికలను నిర్మించింది.
గ్లోబల్ సీడ్ హబ్