హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ మరోసారి అధికారం చేపట్టనున్నదని సెంటర్ ఫర్ స్టడీస్ ఆఫ్ డెవలప్మెంట్ సొసైటీస్ (సీఎస్డీఎస్) లోక్‌నీతి సర్వేయర్, ప్రొఫెసర్ సంజయ్ కుమార్ తేల్చి చెప్పారు. ఐదు రాష్ర్టాల ఎన్నికలపై శనివారం ఓ టీవీ చానల్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐదు రాష్ర్టాల ఎన్నికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఎన్నికలపై స్పందిస్తూ.. ‘కాంగ్రెస్ గెలుస్తుందని నేను అనుకోవటం లేదు.
బీఆర్ఎస్ కచ్చితంగా లీడ్‌లో ఉన్నది. సంక్షేమ పథకాలతో గ్రామీణ ఓటర్లంతా ఆ పార్టీవైపే ఉన్నారు. నాకున్న అంచనా ప్రకారం అక్కడ కాంగ్రెస్‌కు అధికారం దక్కటం అసాధ్యం. ఎన్నికలపై పోల్స్ విషయంలో కచ్చితమైన ఆధారం అంటూ ఏదీ లేదు. వాటిని నమ్మలేం. ఏ పద్ధతిలో పోల్స్ నిర్వహిస్తారు? అన్నది ఎవరూ చెప్పరు’ అని పేర్కొన్నారు.