హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2న జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లు జాతీయ పతాకావిషరణ చేయాలని సీఎస్ శాంతికుమారి సూచించారు. రాష్ట్ర అవతరణ ఉత్సవాల నిర్వహణ, విత్తన సరఫరాపై గురువారం ఆమె కలెక్టర్లతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించా రు. రాష్ర్టావతరణ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. జిల్లా కేంద్రాల్లో జరిగే కార్యక్రమాలకు ప్రజాప్రతినిధులను, ఇతర ప్రముఖులను, జిల్లా అధికారులను ఆహ్వానించాలని చెప్పారు.
హైదరాబాద్లో జరిగే ఉత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ప్రతి శాఖ నుంచి ఒక నోడల్ అధికారిని నియమించి సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో విత్తనాలను బ్లాక్ మారెట్లకు తరలించి, కృత్రిమ కొరత సృష్టించే వ్యాపారులపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలని కలెక్టర్లను సీఎస్ శాంతికుమారి కలెక్టర్లను ఆదేశించారు. కాన్ఫరెన్స్లో డీజీపీ రవిగుప్తా తదితరులు పాల్గొన్నారు.