Praja Palana | ప్రభుత్వ ఫలాలు ప్రజలకు అందేలా చేపట్టిన ప్రజా పాలన కార్యక్రమానికి రెండోరోజు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని సీఎస్ శాంతికుమారి పేర్కొన్నారు. ప్రజా పాలన కార్యక్రమంలో రెండోరోజు కార్యక్రమ నిర్వహణపై జిల్లా కలెక్టర్లతో నేడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. తొలిరోజు ప్రజాపాలన ప్రజా సదస్సుల్లో ఎదురైన సమస్యలను పునరావృతం కాకుండా అభినందనలు తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దరఖాస్తు ఫారాలు విక్రయించకుండా చూడాలని స్పష్టం చేశారు.
ప్రజాపాలన కార్యక్రమంపై విస్తృత ప్రచారం కల్పించాలని సీఎస్ అధికారులను ఆదేశించారు. ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తు చేసుకోవడానికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ఏర్పాట్లు చేయాలని, అభయహస్తం దరఖాస్తులు నింపడంలో ప్రజలకు సహకరించేలా వలంటీర్లను ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి వంద దరఖాస్తుదారులకు ఒక కౌంటర్ ఏర్పాటు చేయాలని, పురుషులకు, మహిళలకు వేర్వేరు క్యూలైన్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
షామియానా, బారికేడింగ్, తాగునీరు ఇతర సౌకర్యాలను ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమానికి ముందుగా తయారు చేసిన గ్రామసభల షెడ్యూల్‌పై మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో శాసనసభ్యులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో పని చేసి కార్యక్రమాన్ని విజయవంతంగా జరిగేలా జిల్లా అధికారులందరూ కృషి చేయాలన్నారు. టెలీకాన్ఫరెన్స్‌లో మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖల ముఖ్య కార్యదర్శులు దాన కిశోర్, సందీప్ కుమార్ సుల్తానియా తదితరులు పాల్గొన్నారు.