IPS Transfers | హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో 28 మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. పలువురు ఐపీఎస్‌లకు ఐదారు నెలల్లో మూడుసార్లు స్థాన చలనం అయింది. రాహుల్‌హెగ్డేకు గతంలో సిటీ ట్రాఫిక్ విధులు నిర్వర్తించిన అనుభవం ఉండడంతో ఇప్పుడు ఆయనను హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీగా బదిలీ చేశారు. టీ శ్రీనివాసరావు గతంలో సైబరాబాద్ ట్రాఫిక్‌లో ఉండగా, బాలానగర్ డీసీపీగా మార్చారు. మళ్లీ అక్కడి నుంచి ఇప్పుడు జోగులాంబ గద్వాల్ ఎస్పీగా బదిలీ చేశారు. సుబ్బారాయుడు గతంలో కరీంనగర్ సీపీగా చేయగా, హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీగా వేశారు. ఇప్పుడు నేరుగా డీజీపీ ఆఫీస్‌కు రిపోర్ట్ చేయమని ఆదేశించారు. బదిలీల అనంతరం మంచి పోస్టింగ్ ఇవ్వాలన్న ఉద్దేశంతోనే డీజీపీ ఆఫీస్‌కు అటాచ్ చేసినట్టు తెలిసింది.
జానకీ ధరావత్ గతంలో మల్కాజిగిరి డీసీపీగా పనిచేయగా, ఆమెను సౌత్ ఈస్ట్‌జోన్ డీసీపీగా, అక్కడి నుంచి మహబూబ్‌నగర్ ఎస్పీగా బదిలీ చేశారు. విశ్వజిత్ కాంపాటి జీహెచ్ఎంసీలో డీఆర్ఎఫ్ విభాగానికి పనిచేశారు. ఆ తర్వాత టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఎస్పీగా పనిచేశారు. ఇప్పుడు అక్కడి నుంచి సీఐడీకి బదిలీ చేశారు. నితికాపంత్ టాస్క్‌ఫోర్స్ హైదరాబాద్‌లో పనిచేశారు. తర్వాతి బదిలీల్లో మేడ్చల్ జోన్ డీసీపీ, అక్కడి నుంచి ఆదిలాబాద్ కమాండెంట్ సెకండ్ బెటాలియన్‌కు బదిలీ చేశారు.
పోలీసు అకాడమీ డిప్యూటీ డైరెక్టర్‌గా కొనసాగుతున్న శరత్చంద్ర పవార్‌ను హైదరాబాద్ సెంట్రల్‌జోన్ డీసీపీగా నియమించారు. అనంతరం నార్కోటిక్ బ్యూరో ఎస్పీగా బదిలీ చేశారు. ఇప్పుడు నల్లగొండ ఎస్పీగా బదిలీ చేశారు. హైదరాబాద్ నార్త్‌జోన్ డీసీపీగా ఉన్న చందనాదీప్తి కొన్నాళ్లు వెయిటింగ్లో ఉన్నారు. ఆ తర్వాత కొత్త ప్రభుత్వ పోస్టింగ్‌లో నల్లగొండ ఎస్పీగా నియమించి.. కొన్నాళ్లకే మళ్లీ సికింద్రాబాద్ రైల్వే ఎస్పీగా బదిలీ చేశారు. రష్మీ పెరుమాళ్ కూడా సైబరాబాద్ సైబర్ క్రైమ్స్ నుంచి హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్‌కు పంపారు. ఇప్పుడు నార్త్‌జోన్‌కు బదిలీ చేశారు.

