హైదరాబాద్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ): అంబేద్కర్ విగ్రహావిష్కరణ సందర్భంగా వచ్చేవారికి ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు ఉండాలని అధికారులను సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. 14న విగ్రహావిషరణ ఏర్పాట్లపై బుధవారం సీఎస్ సమీక్షించారు. ప్రముఖుల వాహనాల రాకపోకల కోసం నిర్దేశించిన అలైటింగ్ పాయింట్లు ఏర్పాట్లు చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ప్రజాప్రతినిధులు, ఐఏఎస్, ఐపీఎస్, నేషనల్ మీడియా ప్రతినిధులు, ఇతర ప్రముఖులు సమావేశానికి హాజరవుతున్నారని చెప్పారు.
మన రాష్ట్రంతోపాటు మహారాష్ట్ర, ఏపీ నుంచి ఎకువ సంఖ్యలో అతిథులు హాజరవుతున్నారని, వాహనాల హాల్టింగ్ పాయింట్లు సమీపంలో ఏర్పాటు చేయాలన్నారు. ప్రజలు వీక్షించడానికి ఎల్ఈడీ తెరలు ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం ప్రజలను తరలించడానికి చేసిన ఏర్పాట్లపై కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మండల కేంద్రాల్లో బస్సులు ముందు రోజే సిద్ధంగా ఉంచాలని, బస్సులో వచ్చే వారికి అల్పాహారంతోపాటు మధ్యాహ్న, రాత్రి భోజన ఏర్పాట్లు చేయాలని సూచించారు.