CS Shanthi Kumari | హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 5 నుంచి 9 వరకు స్వచ్ఛదనం – పచ్చదనం కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించాలని సీఎస్ శాంతి కుమారి తెలిపారు. ఈ కార్యక్రమానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆయా జిల్లాల కలెక్టర్లకు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో ఉన్న మౌళిక సమస్యలను పరిష్కరించాలన్నారు. స్వచ్ఛదనం – పచ్చదనం కార్యక్రమ నిర్వహణ పై గురువారం అన్ని జిల్లా కలెక్టర్లతో సీఎస్ సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ.. స్వచ్ఛదనం – పచ్చదనం కార్యక్రమం ద్వారా ఇంటింటికి మొక్కలు పంపిణీ చేయడమే కాకుండా అవి మనుగడ సాధించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి గ్రామంలో పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించాలన్నారు. పల్లె ప్రకృతి వనాలు, అర్బన్ ఫారెస్ట్ పార్కులతో పాటు ఇతర వనాల నిర్వహణ సరిగా ఉండేలా చూడాలన్నారు. గతంలో నాటిన మొక్కలలో ఏవైనా ఎండిపోయి ఉంటే వాటి స్థానంలో కొత్త మొక్కలను నాటాలన్నారు. దోమల నివారణ, అంటువ్యాధులు అరికట్టే చర్యలు, ఇంకుడు గుంతల నిర్వహణ, కొత్త ఇంకుడు గుంతల ఏర్పాట్లపై అధికారులు శ్రద్ద వహించాలన్నారు. ఇంకుడు గుంతల అవసరంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
ఐదు రోజులు నిర్వహించే ఈ కార్యక్రమంలో రోజుకో ప్రత్యేకత ఉండేలా ప్రణాళిక రూపొందించి వాటి వివరాలను ఇప్పటికే కలెక్టర్లకు పంపించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ నెల 5న ప్రజల భాగస్వామ్యంతో ర్యాలీలు నిర్వహించడం, విద్యార్ధులకు వివిధ పోటీలు నిర్వహించడం వంటి ఫ్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలన్నారు. అధికారులు ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ఈ కార్యక్రమం మంచి అవకాశమని మన రాష్ట్రంలో చాలా మంది కలెక్టర్లు యువకులే ఉన్నారని వారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సీఎస్ సూచించారు.
ప్రతి గ్రామంలో చురుకుగా ఉన్న యువజనల సంఘాలు, స్వచ్చంద సేవా సంస్థలు, రాజకీయ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి గ్రామంలో ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేయాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి అహ్మద్ నదీమ్, పీసీసీఎఫ్ ఎలుసింగ్ మేరు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ అనితా రామచంద్రన్, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, మున్సిపల్ శాఖ కమిషనర్ వీపీ గౌతమ్ ఇతర అధికారులు పాల్గొన్నారు.