Food Poison | హైదరాబాద్,నవంబర్ 28 (నమస్తేతెలంగాణ): రాష్ట్రంలో గురుకులాలు, పాఠశాలల్లో రెండు, మూడు నెలలుగా వరుస ఫుడ్ పాయిజ న్ ఘటనల నేపథ్యంలో సర్కారులో చలనం వ చ్చింది. ఇన్నాళ్లు చిన్న ఘటనలుగా చూపుతూ నిర్లక్ష్యం చేసింది. విద్యాశాఖను తన వద్దే అట్టిపెట్టుకున్న సీఎం రేవంత్ తూతూ మంత్రంగా సమీక్షించి అధికారులకు ఆదేశాలు జారీచేశారు. అయినా ఈ ఘటనలకు ఫుల్స్టాప్ పడనేలేదు. ఇటీవల వాంకిడి గురుకులం, మాగనూరు జడ్పీ స్కూల్లో జరిగిన ఫుడ్ పాయిజన్ వరుస ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. 20 రోజులుగా నిమ్స్‌లో చికిత్సపొందుతూ విద్యార్థిని శైలజ మరణించడం సంచలనంగా మారింది. దీంతో గురుకులాలు, సంక్షేమ పాఠశాలల్లో నెలకొన్న పరిస్థితుల పరిశీలనకు గురుకుల బాట పట్టాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ సారథ్యంలో ఆంజనేయులుగౌడ్, ఎర్రోళ్ల శ్రీనివాస్, రాజారాం యా దవ్, వాసుదేవరెడ్డి సభ్యులుగా ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేసింది. దీంతో ప్రభుత్వంలో కదలిక వచ్చింది. ఎట్టకేలకు నిద్రమత్తు వీడిన ప్రభుత్వం ఆహార నాణ్యత పరిశీలనకు టాస్క్‌ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
పాఠశాలలు, గురుకులాలు, సంక్షేమ వసతిగృహాలు, అంగన్వాడీ కేంద్రాల్లో ఫుడ్‌సేఫ్టీ కమిటీల ఏర్పాటుకు గురువారం సీఎస్ శాంతికుమా రి ఉత్తర్వులు జారీచేశారు. ఫుడ్ సేఫ్టీ కమిషనర్, ఆయా సంస్థల హెచ్వోడీలు, జిల్లాస్థాయి అధికారుల నేతృత్వంలో ప్రిన్సిపాల్/వార్డెన్‌తోపాటు మరో ఇద్దరు సిబ్బందితో కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. సభ్యులు ప్రతిరోజూ వంట చే యడానికి ముందు స్టోర్‌రూం, కిచెన్‌ను పరిశీలించాల్సి ఉంటుంది. సంబంధించిన ఫొటోలు తీసి ఉన్నతాధికారులకు పంపించాలి. వండిన ఆహారాన్ని కమిటీ సభ్యులు తిన్న తర్వాతే విద్యార్థులకు పెట్టాలని ఆదేశాలు జారీచేశారు.
గతంలో ఆహార నాణ్యత కోసం ప్రత్యేక కమిటీలు లేకపోయినా.. ఈ బాధ్యతను హెచ్ఎంలు, ప్రిన్సిపాళ్లు, వార్డెన్లు చూసేవారు. రోజూ వారు తిన్న తర్వాతే పిల్లలకు భోజనం పెట్టేవారు. ఉన్నతాధికారులు సైతం ఎప్పటికప్పుడూ పర్యవేక్షించేవారు. కానీ ప్రస్తుతం అధికారుల పర్యవేక్షణాలోపం స్పష్టంగా కనిపిస్తున్నది.
నాణ్యమైన సరుకుల సరఫరా జరగపోవడం, ఏజెన్సీలు ఇచ్చే కమిషన్లకు కక్కుర్తిపడి నాణ్యతలేని సరుకులిచ్చినా పట్టించుకోకపోవడంతో ఆ హార కల్తీ ఘటనలు జరుగుతున్నాయని విద్యారంగ నిపుణులు చెప్తున్నారు. కానీ ఇవేమీ పట్టించుకోని ప్రభుత్వం తిరిగి అదే ఉన్నతాధికారుల నేతృత్వంలో ఫుడ్ సేఫ్టీ కమిటీలు వేయడం వల్ల ఒరిగేదేమీ ఉండదని పెదవి విరుస్తున్నారు. నాణ్యమైన సరుకుల సరఫరాపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేగానీ టాస్క్‌ఫోర్స్ కమిటీలతో ఆశించిన ఫలితాలు రావని వారు అభిప్రాయపడుతున్నారు.