Heavy Rains | హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రెండ్రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించిన నేపథ్యంలో మరో 48 గంటలపాటు అత్యంత అప్రమత్తతతో ఉండాలని జిల్లా కలెక్టర్లు, పోలీస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. వర్షాలపై సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో సీఎస్ బుధవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎటువంటి ప్రాణ, ఆస్తినష్టం లేకుండా విస్తృతస్థాయిలో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గోదావరి పరీవాహక ప్రాంతంలో పలు ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు, కాలువలు పూర్తిస్థాయి నీటి మట్టంతో ప్రవహిస్తున్నాయని, ఆయా ప్రాంతాల్లో జాగ్రత చర్యలను చేపట్టాలని సూచించారు. లోతట్టు ప్రాంతాలు, ముంపునకు గురయ్యే ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. ఇప్పటికే గుర్తించిన పునరావాస కేంద్రాల్లో అవసరమైన వస్తు సామగ్రి ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. వర్షాలకు దెబ్బతినే రాష్ట్ర, నేషనల్ హైవే రోడ్లను వెంటనే మరమ్మతులు చేయాలని ఆదేశించారు. పర్యాటక ప్రాంతాలకు సందర్శకులను వెళ్లనివ్వద్దని సూచించారు.
డీజీపీ వీడియో కాన్ఫరెన్స్
భారీ వర్షాల నేపథ్యంలో డీజీపీ అంజనీకుమార్ సైతం పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. చేపట్టాల్సిన ముందుజాగ్రత్త చర్యలపై పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో బుధవారం రాత్రి డీజీపీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పలు ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు పూర్తిగా నిండాయని, ఈ జలాశయాల వద్దకు ఎవరూ వెళ్లకుండా చర్యలు చేపట్టాలని పోలీస్ అధికారులను ఆదేశించారు.