హైదరాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): అంబేద్కర్ మహా విగ్రహం హైదరాబాద్ నడిబొడ్డున నిర్మించడం హర్షణీయమని, ఇదొక విగ్రహమే కాదని ఒక చైతన్య దీప్తి, నిత్య స్ఫూర్తి అని సీఎస్ శాంతికుమారి తెలిపారు. శుక్రవారం హైదరాబాద్లో అంబేద్కర్ మహా విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆమె స్వాగతోపన్యాసం చేశారు. 125 అడుగుల ఎత్తులో ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహాన్ని నిర్మించిన సీఎం కేసీఆర్ స్ఫూర్తి అందరికీ ఆదర్శమని పేర్కొన్నారు. ఈ చారిత్రక ఘట్టంలో భాగస్వామి అయినందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఈ మహోన్నత లక్ష్యాన్ని సాధించడానికి ప్రధాన కారకుడు, ప్రేరకుడైన సీఎం కేసీఆర్కు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. .
జ్ఞానసాధనతోనే అద్భుత ప్రగతి
జ్ఞానసాధనతోనే అద్భుత ప్రగతి సాధ్యమని చాటిచెప్పిన మహనీయుడు అంబేద్కర్ అని శాంతికుమారి తెలిపారు. అట్టడుగు సామాజికవర్గంలో జన్మించినప్పటికీ, ఆకాశమే హద్దుగా అనంతమైన జ్ఞానసాధన ద్వా రా ఎలాంటి వారైనా అద్భుతమైన ప్రగతిని సాధించవచ్చని నిరూపించిన మహనీయుడు అంబేద్కర్ అని చెప్పారు. కొలంబియా, లండన్ యూనివర్సిటీల్లో అత్యున్నత చదువులు చదివి, ప్రపంచదేశాల న్యాయ శాస్త్రాలన్నింటినీ ఔపోసన పట్టిన మహామేధావి అంబేద్కర్ అన్నారు. బోధించు, సమీకరించు, పోరాడు.. అంబేద్కర్ చెప్పిన ఈ వాక్యాలు ఇప్పటికీ జాతికి నూతన ఉత్తేజాన్ని నింపుతున్నాయని తెలిపారు.
తెలంగాణలో అంబేద్కర్ పాలన
అంబేద్కర్ చూపిన బాటలో, ఆయన మార్గదర్శనంలో తెలంగాణలో పాలన సాగుతున్నదని శాంతికుమారి పేర్కొన్నారు. 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత తొమ్మిదేండ్లలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం అద్భుతమని చెప్పారు. రాష్ట్ర జీఎస్డీపీ మూడు రెట్లు పెరిగి, రూ.13.27 లక్షల కోట్లకు చేరిందని వెల్లడించారు. తలసరి ఆదాయం రూ.3,17,115 దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని గుర్తుచేశారు. దేశంలో ఎకడా లేని వినూత్నమైన అభివృద్ధి, సంక్షేమ పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్నదని తెలిపారు. ఈ పథకాల్లో మాణిక్యమకుటం వంటిది ‘దళితబంధు’ పథకమని పేర్కొన్నారు. ఒక సందర్భంలో అంబేదర్ ఐ మెజర్ ది ప్రోగ్రెస్ ఆఫ్ ఏ కమ్యూనిటీ బై ది డిగ్రీ ఆఫ్ ప్రోగ్రెస్ విచ్ ఉమెన్ హావ్ అచీవ్డ్ అని చెప్పిన మాటల స్పూర్తితో, తెలంగాణ ఆడబిడ్డల కోసం 33 శాతం రిజర్వేషన్లు, కల్యాణలక్ష్మి, కేసీఆర్కిట్, కేసీఆర్ న్యూట్రిషన్కిట్, భరోసా, షీ టీమ్స్ వంటి ఎన్నో కార్యక్రమాలు తెలంగాణలో అమలవుతున్నాయని వివరించారు. నూతన సామాజిక స్వాప్నికుడు అంబేద్కర్ విగ్రహావిష్కరణలో భాగస్వాములైన శిల్పి రామ్ వీ సుతార్తోపాటు ఇంజినీరింగ్ సిబ్బందికి, కార్మికులు అందరికీ అభినందనలు తెలిపారు.