ఎల్లారెడ్డిపేట/ సిరిసిల్ల రూరల్, మే 21: ఐఏఎస్ అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించవద్దని సీఎస్ ఇటీవల ఆదేశించారు. ఈ ఆదేశాలు వచ్చి రెండు రోజులు కాకముందే రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట, తంగళ్లపల్లి మండల కేంద్రాల్లో అధికారిక కార్యక్రమాన్ని పార్టీ కార్యక్రమంలా నిర్వహించిన తీరుపై పలువురు అసహనం వ్యక్తంచేశారు. బుధవారం రెండు చోట్ల ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమానికి కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా హాజరయ్యారు.
అధికారిక వేదికపై ఉంచిన ప్లెక్సీపై ప్రొటోకాల్ నిబంధనలను తుంగలో తొక్కి స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ ఫొటో ముద్రించకపోవడంపై పలువులు ఆగ్రహం వ్యక్తంచేశారు. అధికారిక కార్యక్రమ సభావేదికపై ఎలాంటి పదవి లేని కాంగ్రెస్ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్‌రెడ్డిని కలెక్టర్ తన పక్కన కూర్చోబెట్టుకోవడంతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు కూర్చోవడం విమర్శలకు తావిచ్చింది. ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీలోనూ కలెక్టర్ పార్టీ నాయకుడు కేకే మహేందర్‌రెడ్డితో కలిసి లబ్ధిదారులకు అందించి ప్రొటోకాల్ నిబంధనలను విస్మరించారు.