హైదరాబాద్, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ) : పోలీసింగ్ అనేది ఒకప్పుడు కేవలం భౌతిక ప్రపంచానికే పరిమితమై ఉండేదని, ఇప్పుడు వర్చువల్(డిజిటల్) ప్రపంచంలోకి మారిపోయిందని.. ఆన్లైన్ క్రైమ్, మోసాలు పెరిగిపోవడమే ఇందుకు ప్రధాన కారణమని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్‌లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో షీల్డ్-2026 కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. డిజిటల్ నేరాలను అరికట్టేందుకు పోలీసులు సిద్ధంగా ఉండాలని సూచించారు.
‘గతంలో దొంగతనాలు జరిగితే అనుమానిత వ్యక్తులను గుర్తించి నేరాలను అరికట్టేవాళ్లం. కానీ, నేడు ఫిషింగ్ అటాక్స్, నైజీరియన్ సామ్స్, నకిలీ లింకుల ద్వారా అమాయకులే కాకుండా సాంకేతిక పరిజ్ఞానం తెలిసినవారూ మోసపోతున్నారు. డీజీపీ శివధర్‌రెడ్డి మాట్లాడుతూ.. మారుతున్న కాలానికి అనుగుణంగా నేరాల సరళి కూడా మారుతున్నదని, దానికి అనుగుణంగా వర్చువల్ పోలీసింగ్ ఎంతో కీలకంగా మారిందని పేరొన్నారు.