చేర్యాల, జనవరి 19 : గజ్జెల లాగులు..ఢమరుక నాదాలు..డోలు చప్పులు..అర్చకుల పూజలు..ఒగ్గు పూజారుల పట్నాలు..పోతురాజుల విన్యాసాలు, మహిళల బోనాల సమర్పణలతో మల్లన్న క్షేత్రం పులకించిపోయింది. స్వామి వారి దర్శనానికి తరలివచ్చిన భక్తులు(Devotees) చేసిన ఓం శ్రీ మల్లికార్జున స్వామియే నమహా నామస్మరణలతో మల్లన్న క్షేత్రం పరవశించింది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రానికి పట్నం వారం సందర్భంగా 50వేల మంది భక్తులు తరలివచ్చారు. కొమురవెల్లి మల్లన్న ఉత్సవాలు పట్నం వారంతో వైభవంగా ప్రారంభమయ్యాయి.
బ్రహ్మోత్సవాలలో మొదటి వారం పట్నంవారంగా పిలువడం ఆనవాయితీ,ఈ క్రమంలో పట్నం(హైదరాబాద్)కు చెందిన భక్తులు భారీగా తరలివచ్చి స్వామి వారిని దర్శించుకుని, పెద్దపట్నం వేసి అగ్నిగుండం దాటుతారు దీంతో మొదటి వారాన్ని పట్నం వారంగా పిలుస్తున్నారు. పట్నం వారం సందర్భంగా మల్లన్నను మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి తన బంధువులు, స్నేహితులతో కలిసి దర్శించుకున్నారు.
రేపు పెద్దపట్నం, అగ్నిగుండం
మల్లన్న ఆలయవర్గాల సహకారంతో హైదరాబాద్ ఒగ్గు పూజారుల సంఘం ఆధ్వర్యంలో హైదరాబాదీ భక్తులు మల్లన్న క్షేత్రంలోని కల్యాణ వేదిక వద్ద సోమవారం పెద్దపట్నం వేసి అగ్నిగుండం తయారు చేయనున్నారు. స్వామి వారి పట్నం వారానికి వచ్చిన భక్తులు పెద్దపట్నం, అగ్నిగుండం దాటి స్వామి వారిని మరోసారి దర్శించుకోనున్నారు. భక్తులు మొక్కుల అనంతరం నల్లపోచమ్మ, కొండపోచమ్మ ఆలయాలకు వెళ్లి అక్కడ అమ్మవార్లకు బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకోనున్నారు.