నమస్తే న్యూస్‌నెట్‌వర్క్, అక్టోబర్ 25 : పలు జిల్లాల్లో శనివారం కురిసిన వర్షానికి పంటలు దెబ్బతిన్నాయి. వనపర్తి, మహబూబ్‌నగర్ జిల్లా మూసాపేట, అడ్డాకుల మండలం కందూరు ఆలయం వద్ద ఆరబెట్టిన ధాన్యం వర్షార్పణమైంది. అప్రమత్తమైన రైతులు కవర్లు కప్పినా చాలావరకు వరి తడిచిపోయింది. మళ్లా ఆరబెట్టాలంటే మూడ్రోజుల సమయం పడుతుందని రైతులు వాపోయారు. శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలోని పలు గ్రామాల్లో చేతికొచ్చిన వరి దెబ్బతిన్నది. నేలకొరిగి వడ్లు రాలిపోయాయి. పంట నష్టపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
శనివారం కురిసిన వర్షానికి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని చందూర్, మోస్రా, ఎడపల్లి, నిజామాబాద్ రూరల్, బోధన్, రెంజల్ మండలాల్లో రైతులు ఆరబోసిన ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. కొన్నిచోట్ల ధాన్యాన్ని కుప్పలుగా పేరుస్తూ పాలిథిన్ కవర్లు కప్పి కాపాడుకునే ప్రయత్నం చేశారు. నిజామాబాద్ రూరల్ మండలం లింగి తండాలో ధాన్యం కొట్టుకుపోయింది. ఆదిలాబాద్ జిల్లా జైనథ్, బేల మండలాల్లో సోయా పంట తడిసింది.