ఎల్లారెడ్డిపేట, ఫిబ్రవరి 20 : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని రైతులు పది రోజులుగా నీళ్ల కోసం అధికారులు, నాయకులు చుట్టూ తిరుగగా మల్కపేట రిజర్వాయర్ నీళ్లను కాల్వలోకి వదిలారు. మూడు రోజుల్లో మోటర్లు పెట్టి పొలాలకు పారించడంతో కాల్వలో నీళ్లు తగ్గడంతో మళ్లీ చివరి ఆయకట్టు రైతులు ఆందోళనలో పడ్డారు. ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్పూర్ నుంచి రాజన్నపేట వరకు కాల్వలో ఉన్న నీటిని పొలాలకు పెట్టుకుంటున్నప్పటికీ రాజన్నపేట శివారు నుంచి కిష్టూనాయక్ తండా, దేవునిగుట్ట తండా, బాకుర్పల్లి, తిమ్మాపూర్ వరకు ఉన్న కాల్వలో నీరంతా ఇంకిపోయింది.
దీంతో కాల్వలోని నీటిని పారించేందుకు తెచ్చిన మోటర్లు కాలిపోగా, మరికొన్ని పనికిరాకుండా పోయాయి. దీనిపై ఈఈ కిశోర్ కుమార్ను వివరణ కోరగా మల్కపేట రిజర్వాయర్లో ఒక అడుగు మేర నీరు ఉండగా కాల్వలో వదిలామని, ప్రస్తుతానికి నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదని తెలిపారు. మిడ్ మానేర్ నుంచి పలు ప్రాంతాల ఆయకట్టుకు నీళ్లు వదిలేందుకు నిర్ణయం జరిగిందని, మల్కపేటలో లేకపోవడంతో నీటిని పంపింగ్ చేయలేదని చెప్పారు. పంపింగ్ చేస్తే అర టీఎంసీ నీళ్లు వదిలినా కాల్వ, చెరువుల్లో నీళ్లు నింపి సింగ సముద్రం వరకు వచ్చే పరిస్థితి ఉందని, ఉన్నతాధికారుల అనుమతి కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు.
పంట ఎండిపోతుందనుకునే సరికి కాల్వల నీళ్తు వచ్చినయ్. మోటర్తో పెట్టుకున్న. రెండెకరాలుంటే మరో రెండెకరాలు కౌలుకు తీసుకున్న. కౌలుకు తీసుకున్న రెండెకరాలకు నిన్నటి దాకా నీళ్లచ్చి బందైనయ్. లక్ష దాకా పెట్టుబడి పెట్టిన. పంటేమైతదో అర్థమైతలేదు. మిడ్ మానేర్ నుంచి పంపింగ్ చేయడం తప్ప మార్గం లేదని అధికారులు చెపుతున్నరు. నాయకులు, అధికారులు పంటలు కాపాడాలె.