రాజన్న సిరిసిల్ల, మే 15 (నమస్తే తెలంగాణ) : ‘వర్షాలు కురవాలి.. నదులు పారాలి.. పంటలు పండి పశుసంపద పెరగాలి.. కాలం మంచిగై బీరప్ప దయతో రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆకాంక్షించారు. జీవసంపద దినదినాభివృద్ధి చెందాలని, శాంతిభద్రతలు బాగుండాలని కోరుకున్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలో గురువారం ఆయన విస్తృతంగా పర్యటించారు.
హైదరాబాద్ నుంచి సాయంత్రం నాలుగున్నర గంటలకు తంగళ్లపల్లి మండలం అంకిరెడ్డిపల్లెకు చేరుకుని బీరప్ప కల్యాణ వేడుకలకు హాజరయ్యారు. అక్కడి నుంచి సిరిసిల్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకుని పార్టీ కార్యకర్తలతో ముచ్చటించారు. రాత్రి 7 గంటలకు సిరిసిల్ల అర్బన్ మండలం పెద్దూరులో కార్యకర్త దేవగౌడ కూతురు వివాహం కాగా, ఆయన నివాసానికి వెళ్లి వధూవరులను ఆశీర్వదించారు. ఎల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామానికి చేరుకుని దర్శావలీ దర్గా ఉర్సు ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పండుగ వాతావరణంలో జరుగుతున్న బీరప్ప ఉత్సవాలకు హాజరు కావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. బీరప్ప ఆశీస్సులతో అందరూ చల్లంగా ఉండాలని ఆకాంక్షించారు.