కరీంనగర్ జిల్లా పరిధిలోని మానేరు డ్యామ్ గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మార్చి నెలలో నిండుగా జలకళను సంతరించుకున్నది. అన్నదాతల ఇబ్బందులను తీర్చింది. నేడు ఈ మార్చి నెలలోనే నీరు తగ్గడంతో దానిలో ఉన్న పాత రోడ్డు తేలింది. చుట్టూ గట్లు తేలి కనిపిస్తున్నాయి. కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెళ్లే రోడ్డులో ఎల్ఎండీ మానేరు డ్యామ్ వద్ద ఈ దృశ్యం కంటపడింది.
నీళ్లిస్తలేరని రైతుల నిరసన
సుల్తానాబాద్‌రూరల్; ఎస్సారెస్పీ డీ-86లో నీళ్లు రావడంలేదని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కనుకుల, తొగర్రాయి, జెండాపల్లి, రామునిపల్లి, మంచరామి గ్రామాల రైతులు ఆందోళనకు దిగారు. ఎండిన మక్కచేలు చూపిస్తూ ఆవేదన వ్యక్తంచేశారు. –
నీళ్లులేక వాడుతున్న మామిడి తోట
దేవరుప్పుల ; జనగామ జిల్లా దేవరుప్పుల మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన మహ్మద్ యాకూబ్ పాషా రెండెకరాలలో మామిడి తోట సాగుచేస్తున్నాడు. బోరులో నీరు అడుగంటింది. తోటను ఎండబెట్టలేక ట్యాంకర్‌తో నీరు తెచ్చి పోస్తున్నాడు. తోట మంచి కాత మీద ఉన్నదని నీరు కట్టకపోతే తీవ్రనష్టం వాటిల్లుతుందని రైతు చెప్తున్నాడు. ఆర్ధిక భారమైనా ట్యాంకర్‌తో నీటిని అందిస్తున్నట్టు తెలిపాడు. –
ట్యాంకర్ నీటితోనే తడిపేది
మరికల్ ; నారాయణపేట జిల్లా మరికల్ మండలం జిన్నారం గ్రామానికి చెందిన రైతు కృష్ణారెడ్డి రెండెకరాల్లో వరి, ఎకరంలో ఉల్లి సాగు చేశాడు. ప్రస్తుతం భూగర్భ జలాలు అడుగంటడంతో బోరులో నీటిమట్టం తగ్గిపోయింది. పంటలు చేతికొచ్చే సమయంలో నీళ్లు లేకపోవడంతో ట్యాంకర్ల ద్వారా నీటిని పారిస్తున్నాడు. రోజుకు రూ.2 వేలు ఖర్చు చేసి నాలుగు ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తున్నాడు.పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.30 వేలు పరిహారం ఇవ్వాలని రైతు కృష్ణారెడ్డి కోరుతున్నాడు.
పంటలెండుతున్నా పట్టించుకోరా?
నవీపేట, మార్చి 15: సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయనినిజామాబాద్ జిల్లా నవీపేట మండలం లింగాపూర్‌కు చెందిన రైతు కోరే నారాయణ ఆవేదన వ్యక్తం చేశాడు. ఎనిమిదిన్నర ఎకరాల్లో వేసిన వరి పొట్టదశలో ఉండగా జన్నేపల్లి వాగులో నీటిచుక్క లేక బోర్లు పోయడం లేదని, పంట ఎండిపోతుండటంతో ఆవేదనకు గురైన ఆయన సెల్ఫీ వీడియోలో తన గోడువెల్లబోసుకున్నాడు. ‘జన్నేపల్లి వాగు ఎండిపోయింది. వాగులో రైతుల బోర్ల నుంచి నీళ్లు అస్తలేవు. పొట్టదశలో ఉన్న పంటలు ఎండిపోయే పరిస్థితి దాపురించింది. గతంలో వాగులో చెలిమె తవ్వి నీళ్లను తాగేవాళ్లం. ప్రస్తుతం పశువులకు సైతం చుక్కనీరు లేదు. ఇరిగేషన్ అధికారులు పట్టించుకుంటలేరు. కాంగ్రెసోళ్లకు ఫోన్ చేస్తే స్పందిస్త లేరు’ అని ఆయన వాపోయాడు.
మోతెను కరువు మండలంగా ప్రకటించాలి
ప్రభుత్వ నిర్లక్ష్యంతో పంటలు ఎండిపోయిన సూర్యపేట జిల్లా మోతెను కరువు మండలంగా ప్రకటించాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు మట్టిపల్లి సైదులు డిమాండ్ చేశారు. మండలంలోని బీక్యాతండాలో ఎండిన వరి పొలాలను ఆ పార్టీ ప్రతినిధి బృందం శనివారం పరిశీలించింది. ఈ సందర్భంగా సైదులు మాట్లాడుతూ ఎస్సారెస్పీ కాల్వల ద్వారా సాగునీరు అందకపోవడంతో మండలంలో వేల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయన్నారు. ప్రభుత్వం ఎండిన పంటలకు ఎకరాకు రూ.30వేలు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని, లేనిపక్షంలో మండలవ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.