సంగారెడ్డి, మార్చి 30 (నమస్తే తెలంగాణ ) : సాగునీరు లేక రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. పచ్చని పంట కండ్లముందే ఎండుతుంటే గుండెలు బాదుకుంటున్నారు. ప్రాజెక్టుల్లో నిండుగా నీళ్లున్నా పొలాలకు నీళ్లు పారటంలేదు. భూగర్భ జలాలు అడుగంటడంతో బోరుబావులు నీళ్లుపోయక పంటలు దెబ్బతింటున్నాయి. కరెంటు కోతలు లోవోల్టేజీతో బోరుమోటర్లు కాలి రైతుల జేబులకు చిల్లులు పడుతున్న విషయాలు సంగారెడ్డి జిల్లాలో ‘నమస్తే తెలంగాణ’ చేపట్టిన ఫీల్డ్ విజిట్‌లో వెలుగుచూశాయి. యాసంగి సీజన్ లో సంగారెడ్డి జిల్లాలో 1.15 లక్షల ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేశారు. సింగూరు, నల్లవాగు ప్రాజెక్టుల కింద వరి, జొన్న, కూరగాయ పంటలను సాగుచేశారు. సంగారెడ్డి, అందోల్, నారాయణఖేడ్ నియోజకవర్గాల్లోని రైతులు బోరుబావుల కింద అత్యధికంగా వరి, నీళ్ల జొన్న సాగు చేశారు. 50 వేల ఎకరాల్లో రైతులు వరి వేశారు. సింగూరు ప్రాజెక్టు కింద నీటిపారుదల శాఖ క్రాప్‌హాలిడే ప్రకటించినప్పటికీ రైతులు 16 వేల ఎకరాలకుపైగా విస్తీర్ణంలో వరి సాగు చేశారు. నల్లవాగు ప్రాజెక్టు, చెరువులు, బోరుబావుల కింద 34 వేల ఎకరాల్లో వరి వేశారు. ఒక్క నల్లవాగు కిందనే 600 ఎకరాలకు సాగునీరు అందక వరి, జొన్న ఎండిపోయే ప్రమాదం ఉన్నది.
పుల్కల్, చౌటకూరు మండలాల్లో అనధికారికంగా కరెంటు కోతలు అమలు చేస్తున్నట్టు రైతులు తెలిపారు. ఉదయం 6 నుంచి ఉదయం 11 గంటల వరకు కరెంటు సరఫరా కావటంలేదని, ఆ తర్వాత కరెంటు సరఫరా అవుతున్నా మధ్యలో కొన్ని గంటలపా టు కరెంట్ ఉండటంలేదని వారు పేర్కొంటున్నారు. లోవోల్టేజీ సమస్య కారణంగా ట్రాన్స్ఫార్మర్లు, బోరుమోటర్లు కాలిపోతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. భూగర్భ జలాలు తగ్గుముఖం పట్టడం, కరెంటు కోతలు, లోవోల్టేజీ సమస్యతో పుల్కల్ మండలంలోని పుల్కల్, బస్వాపూర్, ఇసోజిపేట, గొంగ్లూరు, గంగోజిపేట, చౌటకూరు మండలంలోని చౌటకూరు, బొమ్మారెడ్డిగూడెం, ఉప్పరిగూడెం, బద్రిగూడెం, కోర్పోల్, సుల్తాన్‌పూర్‌లో సాగునీరు అందక వరి ఎండిపోతున్నది. దీంతో సింగూరు ప్రాజెక్టు నుంచి నీరు ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
కేసీఆర్ పాలనలో రైతులకు సాగునీళ్లు, కరెంటు ఫుల్‌గా ఉండేవి. ఇప్పుడు సాగునీళ్లు లేవు. కరెంటు కూడా సరిగ్గా ఉంటలేదు. కోతలు, లోవోల్టేజీతో ఇబ్బంది పడుతున్నాం. లోవోల్టేజీతో మూడు రోజుల క్రితం నా బోరుమోటర్ కాలిపోయింది. బోరుబావిలో నుంచి మోటర్ బయటకు తీసేందుకు రూ.2వేలు, మరమ్మతుకు రూ.6వేలు ఖర్చు అవుతుంది.
నీళ్లు లేక కండ్లముందే వరి ఎండిపోతుంటే కన్నీళ్లొస్తున్నాయి. మరో 20 రోజులు నీళ్లు లేకపోతే పంట పూర్తిగా ఎండిపోతుంది. నాకు ఉన్న 1.50 ఎకరాల్లో అప్పుచేసి మరీ వరి వేసిన. బోరుబావి కింద వరి కలిసివస్తుందని అనుకున్నా. ఇప్పుడు బోరు నీళ్లు పోయటంలేదు. నీళ్లు లేక పంటపూర్తిగా ఎండిపోతుంది. ప్రభుత్వం పెద్ద మనస్సు చేసుకుని సింగూరు నుంచి కాల్వల ద్వారా నీళ్లు ఇచ్చి ఆదుకోవాలి.
మూడు ఎకరాలు కౌలుకు తీసుకుని పంట సాగు చేస్తే నిరుడు అతివృష్టితో నష్టం జరిగిందని ఈ సారి భూగర్భ జలాలు అడుగంటి పొలం ఎండిపోయిందని మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం సీతారాం తండాకు చెందిన రైతు గుగులోత్ బాలు ఆవేదన వ్యక్తంచేశారు. కౌలుకు తీసుకున్న భూమిలో రెండు బావుల ఆధారంగా వ్యవసాయం చేస్తున్నట్టు తెలిపాడు. రూ. 40 వేలు అప్పుచేసి వరి పండిస్తున్నట్టు చెప్పాడు. గతంలో ఆకేరు వాగు వరదలతో మట్టి మేటలు వేశాయని, బావులు వరద నీటితో నిండిపోవడంతో పొలాల్లో పేరుకుపోయిన మట్టిని తొలగించడానికి రూ.లక్ష ఖర్చు చేసినట్టు తెలిపాడు. ఇప్పుడేమో రెండు బావుల్లో నీరు అడుగంటడంతో నీరందక మూడు ఎకరాల వరి ఎండిపోయిందని ఆవేదన చెందాడు.