Devadula | జనగామ, జూలై 15 (నమస్తే తెలంగాణ): రెండేండ్ల క్రితం వరకు పచ్చటి పొలాలతో కళకళలాడిన జనగామ ప్రాంతం ఇప్పుడు కరువు కోరల్లో చిక్కుకున్నది. జిల్లాలో సాధారణ వర్షపాతం నమోదు కాకపోవడంతో వానకాలం సాగు ప్రారంభమై నెలరోజులు దాటుతున్నా సగం విస్తీర్ణంలో కూడా పంటలు వేయలేదు. దీనికితోడు దేవాదుల ద్వారా రిజర్వాయర్లు, చెరువులు, కుంటలు, చెక్‌డ్యాంల్లోకి సకాలంలో గోదావరి జలాలను విడుదల చేయకపోవడంతో ఈ ప్రాంతంలో సాగునీటి ఎద్దడి తీవ్రమైంది. బీఆర్ఎస్ హయాంలో ఎండాకాలంలోనూ నిండుకుండలా మత్తళ్లు దూకిన చెరువులు, కుంటల్లో ఇప్పుడు నీటి జాడలు లేవు. బోర్లు వేస్తే 80 అడుగుల లోతులోనే ఉబికి వచ్చే గంగమ్మ ఇప్పుడు ఏకంగా 7.15 మీటర్ల లోతుకు పడిపోయింది. వ్యవసాయ బోర్లు, బావుల ఆధారంగా పోసుకున్న వరి నారు మడులకు తడులు అందక నెర్రెలువారి పైరు వాలిపోతున్నది. దేవాదుల నీటిని అందించి పంటలను కాపాడాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఈసారి ముందస్తు వానలు పడతాయని, అధిక వర్షపాతం నమోదవుతుందన్న వాతావరణ శాఖ సూచనతో జిల్లా రైతాంగం రోహిణి, మృగశిర కార్తెల్లోనే పెద్ద ఎత్తున పత్తి విత్తనాలు నాటారు. అయితే, సకాలంలో వర్షాలు కురవకపోవడంతో అవి మొలకెత్తలేదు. దీంతో ఒక్కో రైతు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు నష్టపోయాడు. తర్వాత కురిసిన వర్షాలతో మరోసారి నాటిన విత్తనాలు మెలకెత్తినా, ప్రస్తుత వర్షాభావం కారణంగా ఎండిపోతున్నాయన్నాయి. భూగర్భ జలాలు అడుగంటి బోర్లు ఎండిపోతున్న కారణంగా ప్రభుత్వం వెంటనే చెరువుల్లోకి దేవాదుల నీటిని వదిలి ఆదుకోవాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే జనగామ మండలంలోని శామీర్‌పేట, వడ్లకొండ గ్రామాల్లో రైతుల ధర్నాలు చేశారు. కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. గోదావరి జలాలను సముద్రంలోకి వదులుతున్న రాష్ట్ర ప్రభుత్వం దేవాదుల ప్రాజెక్టు ద్వారా లిఫ్టింగ్ చేసి జనగామ ప్రాంతంలోని 9 రిజర్వాయర్లు, 723 చెరువులు, కుంటలను పూర్తిస్థాయిలో నింపితే భూగర్భ జలాలు పెరిగి బోరుబావుల్లో సమృద్ధిగా నీరు చేరి వ్యవసాయం ముందుకు సాగే పరిస్థితి ఉంటుంది.
ధర్మసాగర్ నుంచి జనగామ నియోజకవర్గంలోని అన్ని రిజర్వాయర్లకు నీటిని అందించే దేవాదుల పంపింగ్ ప్రక్రియ పూర్తిస్థాయిలో ప్రారంభం కాలేదు. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఒత్తిడితో సీజన్ దాటిన నెల తర్వాత నామమాత్రంగా తపాస్‌పల్లికి పంపింగ్ చేసే ఒక్క మోటార్‌ను ఆన్ చేశారు. జనగామ, చేర్యాల, స్టేషన్‌ఘన్‌పూర్ ప్రాంతానికి మొత్తం నాలుగు పంపుల (అందులో రెండు పెద్దవి.. రెండు చిన్నవి) ద్వారా పంపింగ్ జరగాల్సి ఉన్నది. జిల్లాలో కరువు పరిస్థితులు కళ్లముందు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నా చెరువులు నింపాలన్న కనీస ప్రయత్నం ఉమ్మడి జిల్లా మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేయకపోవడంతో సంబంధిత అధికారులు కూడా నీటి పంపింగ్ ప్రక్రియను గాలికి వదిలేశారు. రైతులు, రైతు సంఘాల ఆందోళనల నేపథ్యంలో ఎమ్మెల్యే రాజేశ్వర్‌రెడ్డి మరోసారి జోక్యం చేసుకొని రెండో పంపును ఆన్ చేసి రైతుల వరినారు మడులు ఎండిపోకుండా చూడాలని ఒత్తిడి తెచ్చారు. దీంతో ఆదివారం రెండో పంపు ఆన్ చేసిన కొద్దిసేపటికే ధర్మసాగర్ నుంచి గండిరామారం పంపింగ్ చేసే పైపులైన్ పగిలిపోయింది. దీంతో అటు తపాస్‌పల్లి, ఇటు గండిరామారం 7 క్యుమెక్స్ల రెండు లిఫ్ట్‌లకు సంబంధించి మొత్తం 14 క్యుమెక్స్ పంపుల ద్వారా జరిగే నీటి లిఫ్టింగ్ ఆగిపోయింది. దేవాదుల పైపులైన్ల నిర్వహణకు నిధుల కొరత, అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా చివరి వరకు నీటిని ఎత్తిపోయకుండానే మార్గమధ్యంలోనే పైపులైన్లు దెబ్బతింటున్నాయి.
వాటిని తిరిగి మరమ్మతు చేసి నీటి పంపింగ్‌ను పునరుద్ధరించేందుకు వారం, పదిరోజులు పడుతుంటే రిజర్వాయర్లకు నీళ్లు చేరడానికి మరో వారం, పది రోజులు.. అంటే ఒకసారి పైపులైన్లు దెబ్బతింటే పంపింగ్ జరిగేందుకు 20 నుంచి 30 రోజుల సమయం పడుతున్నది. ధర్మసాగర్ నుంచి రెండు పంపుల ద్వారా ఆర్ఎస్ ఘన్పూర్ సహా గండిరామారం రిజర్వాయర్‌కు నీటి పంపింగ్ జరుగుతున్నదని, రైతుల నుంచి పెరుగుతున్న డిమాండ్‌తో గండిరామారానికి వచ్చే మరో పంపును ఆన్ చేయాల్సి ఉందని జిల్లా నీటిపారుదలశాఖ అధికారులు చెప్తున్నారు. వ్యవసాయశాఖ అంచనా వేసిన మేరకు జనగామ జిల్లాలో మొత్తం అన్ని రకాల పంటలు కలిపి 3,63,104 ఎకరాల్లో సాగు కావాల్సి ఉండగా సగానికంటే తక్కువ అంటే సాధారణ విస్తీర్ణంలో 31.17 శాతం అంటే 1,15,166 ఎకరాల్లో మాత్రమే పంటలు వేశారు. జిల్లాలోని 12 మండలాల్లో 9 మండలాల్లో లోటు వర్షపాతం, రెండు మండలాల్లో అధిక వర్షపాతం నమోదైంది. వ్యవసాయశాఖ సాగు అంచనాలో జిల్లాలో సగం కూడా సాగులోకి రాకపోవడం వల్ల భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆహార ధాన్యాల లోటు ఏర్పడే ప్రమాదం ఉన్నదని వ్యవసాయరంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును బూచిగా చూపిస్తూ ఉప్పొంగి ప్రవహిస్తున్న గోదావరి నీటిని రిజర్వాయర్లకు లిఫ్ట్ చేయకుండా రాజకీయాలు చేస్తూ రైతాంగాన్ని నష్టపరుస్తున్నదని రైతు సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు.
దేవాదుల పంపులు, పైపులైన్ల నిర్వహణ లోపంతో ప్రభుత్వం, సంబంధిత అధికారుల చర్యలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. పంటలు ఎండిపోతుంటే ధర్మసాగర్ నుంచి జనగామ నియోజకవర్గ రైతాంగానికి సాగు నీరందించే తపాస్‌పల్లి, గండిరామారం 14 క్యుమెక్స్ల రెండు దేవాదుల పెద్ద పంపుల నుంచి పంపింగ్ నిలిచిపోవడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. యుద్ధప్రాతిపదికన పైపులైన్లకు మరమ్మతు చేసి రెండు పంపులను నడిపించి నియోజకవర్గంలోని అన్ని రిజర్వాయర్లను నింపి పంటలను కాపాడాలని నీటిపారుదలశాఖ ఉన్నతాధికారులను కోరారు. రెండో మోటర్ ఆన్ చేయమంటే నడిచే ఒక్క మోటార్‌ను ఆపారని అన్నారు. యుద్ధప్రాతిపదికన పైపులైన్‌కు మరమ్మతు చేసి ముందుగా గండిరామారం రావాల్సిన రెండు పెద్ద పంపులు ఆన్ చేయాలని, లేకుంటే రైతులు పెద్దఎత్తున ఆందోళనకు దిగుతారని హెచ్చరించారు.
ప్రభుత్వం దేవాదుల నీటి పంపింగ్ చేపట్టని ఫలితంగా జనగామ జిల్లాకు సాగునీరు అందడం లేదు. పంటలు ఎండుతున్నాయని రైతులు గగ్గోలు పెడుతున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. గోదావరి జలాలు పారక స్టేషన్‌ఘన్‌పూర్ మండలంలోని దేవాదుల కెనాల్ ఇలా బోసిపోయింది.