Revanth Reddy | వికారాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ): సాగునీరు అందక సీఎం సొంత నియోజక వర్గంలో పంటలు ఎండుతున్నాయి. కొడంగల్ నియోజకవర్గం బొంరాస్పేట్ మండల పరిధిలోని కాకరవేణి ప్రాజెక్టులో నిండుగా నీరున్నప్పటికీ సాగునీరివ్వని పరిస్థితులు నెలకొన్నాయి. కాకరవేణి ప్రాజెక్టు కింద 1,326 ఎకరాల ఆయకట్టు ఉన్నది. ప్రాజెక్టులో నీళ్లున్నా కాలువలు పూర్తిగా దెబ్బతినడంతో పంటలకు నీరిచ్చే పరిస్థితి లేకుండా పోయింది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలువల మరమ్మతు మరిచింది. రైతులు విన్నవించినా పట్టించుకోలేదు. సీఎం సొంత నియోజకవర్గం కావడంతో మరమ్మతు పనులు చేసి సాగుకు నీళ్లిస్తారనే భరోసాతో రైతు లు ఆయకట్టు కింద సాగు చేసిన వరి పంట ఎండుముఖం పట్టింది. పంటలను కాపాడుకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. సాక్షాత్తు సీఎం రేవంత్రెడ్డి సొంత నియోజక వర్గంలోనే ఇలాంటి పరిస్థితులు నెలకొనడంపై రైతులు ఆగ్ర హం వ్యక్తంచేస్తున్నారు.