హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): అకాలవర్షాలు.. వడగండ్లు.. అతివృష్టి.. అనావృష్టి.. పరిస్థితి ఏదైనా రైతులకు పంటనష్టాలు, కష్టాలు తప్పడం లేదు. ఇలాంటి పరిస్థితుల నుంచి రైతులను ఆదుకునేందుకు అన్ని పంటలకు బీమా కల్పిస్తామ ని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు సీజన్లు పూర్తయ్యాయి. కానీ, పంటల బీమా పథకం ఇంకా పట్టాలెక్కలేదు. కనీసం ఈ వానకాలం నుంచైనా పంటల బీమా అమలుచేస్తారని ఆశపడ్డ రైతులకు నిరాశే మిగులుతున్నది. ఈ సీజన్లోనూ ఇంత వరకూ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. నిజానికి, గత యాసంగి సీజన్‌కు ముందు పంటలబీమా పథకం అమలు చేస్తామని ప్రభుత్వం హంగామా చేసింది. వానకాలం సీజన్ నుంచే అమలు చేస్తామంటూ సంకేతాలు ఇచ్చింది. ఇందుకు సంబంధించి కంపెనీలతో మంతనాలు పూర్తయ్యాయి. కానీ ఏం జరిగిందో తెలియదు కానీ కథ మళ్లీ మొదటికొచ్చింది. వ్యవసాయ శాఖ అధికారులు గప్‌చుప్ అయ్యారు.
రైతులకు పరిహారం కరువు
ప్రభుత్వం పంటల బీమా పథకం అమలు చేయకపోవడంతో అతివృష్టి, అనావృష్టి కారణంగా పంటలు దెబ్బతిన్న రైతులకు చివరకు నష్టాలే మిగులుతున్నాయి. ఇటు ప్రభుత్వం నుంచి నష్ట పరిహారం అందక, అటు పంటల బీమా పరిహారం అందక తీవ్రంగా నష్టపోయి అప్పులపాలవుతున్నారు. గత మార్చి, ఏప్రిల్ నెలల్లో కురిసిన అకాల వర్షాల కారణంగా రాష్ట్రంలో 51వేల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు ప్రభుత్వం గుర్తించింది. ఎకరానికి రూ.10వేల చొప్పున నష్ట పరిహారం మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కానీ, రైతులకు ఇప్పటివరకూ నష్ట పరిహారం అందలేదు. ఈ వానకాలం సీజన్లో ముందుగానే పలకరించిన వర్షాలను చూసి రైతులు విత్తనాలు వేశారు. కానీ, ఆ తర్వాత వర్షాలు ముఖం చాటేయడంతో విత్తనాలు మొలకెత్తలేదు. దీంతో రైతులు పెట్టుబడి నష్టపోతున్నారు. ఒకవేళ పంటల బీమా అమలుచేస్తే ఇలాంటి రైతులకు పరిహారం దక్కేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రైతులపైనే బీమా భారం!
పంటల బీమా పథకాన్ని అమలుచేసేందుకు కసరత్తు చేస్తున్నామని, రైతుల వాటా ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గతంలో ప్రకటించారు. ఇందుకోసం సుమారు రూ.1,400 కోట్లు అవసరమని అంచనా వేశారు. కానీ, ఇప్పుడు ఈ మాటపై మడమతిప్పినట్టే కనిపిస్తున్నది. కొద్దిరోజుల క్రితం పంటల బీమాపై సమీక్షించిన మంత్రి తుమ్మల.. రైతుల వాటాను రైతులే చెల్లించాలనే విధంగా ప్రకటన చేయడం గమనార్హం. రైతుల వాటా, ప్రభుత్వ వాటాగా ఎంత చెల్లించాలనే అంశంపై గతంలోనే అంచనాలు వేసినప్పటికీ, మరోసారి అంచనా వేయాలని అధికారులకు సూచించడం కాలయాపనలో భాగమనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.