నమస్తేతెలంగాణ న్యూస్ నెట్వర్క్, ఏప్రిల్ 11 : రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గురువారం రాత్రి ఈదురు గాలులతో కురిసిన వర్షానికి పంటలకు నష్టం వాటిల్లింది. జోగుళాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం శేషంపల్లి, విఠలాపురం గ్రామాల్లో బొప్పాయి, మామిడి తోటలు దెబ్బతిన్నాయి. శేషంపల్లిలో రైతు రమేశ్‌కు చెందిన 4ఎకరాల బొప్పాయి తోటలో దాదాపు 500 చెట్లు నేలకొరగడంతోపాటు కాయలన్నీ కూడా నేలరాలాయి. అదేవిధంగా మామిడి తోటలో కాయలు రాలిపోయాయని, ప్రస్తుతం మామిడి తోట కాపు చాలా తక్కువగా ఉందని, ఈదురు గాలులతో ఉన్న మామిడి కాయలు రాలిపోయి రూ. లక్షల్లో నష్టం వాటిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా మానవపాడు మండలంలో కల్లాల్లో ఆర బోసుకున్న మిరప తడిసింది. నల్లగొండ జిల్లాలోని గుర్రంపోడు, పెద్దవూర, గుడిపల్లితోపాటు పలు మండలాల్లో పంటలు దెబ్బతిన్నాయి. వరితోపాటు మామిడి, జొన్న, ఉద్యానం పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.