హైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ): అకాల వర్షాలతో పంటలు దెబ్బతిన్నాయని, ఎకరాకు రూ.25వేల నష్టపరిహారం చెల్లించాలని తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేసింది. గురువారం తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్రావు, ప్రధాన కార్యదర్శి సాగర్ మాట్లాడుతూ.. మంచిర్యాల, కుమ్రంబీం ఆసిఫాబాద్ జిల్లాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని వెల్లడించారు.
మొక్కజొన్న, వరి, పత్తి, మిరప పంటలకు నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. మహబూబ్నగర్ జిల్లాలో మొక్కజొన్న, పుచ్చకాయ పంటలకు తీవ్రంగా నష్టం వాటిల్లిందని వెల్లడించారు. దాదాపు పదివేల ఎకరాల్లో మిర్చి దెబ్బతిన్నదని, మామిడి కాయలు నేలరాలాయని పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లాలో 217 మేకలు మృతిచెందాయని చెప్పారు. వనపర్తి జిల్లాలో పిడుగుపాటుకు వ్యక్తి మృతిచెందినట్టు తెలిపారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.