నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఏప్రిల్ 21 : వడగండ్ల వానకు పంటలు దెబ్బతిన్నాయి. చాలాచోట్ల వరి, మామిడి, మక్క, నువ్వుల పంటలు దెబ్బతినగా పలుచోట్ల జొన్న కుప్పలు తడిసిముద్దయ్యాయి. నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం వత్తుగండ్లలో మంగళవారం సాయంత్రం వడగండ్లు పడ్డాయి. ఈదురుగాలులతో చేతికొచ్చిన వరి గింజలు, మామిడి కాయలు రాలిపోయాయి. మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ మండలంలో మక్కజొన్న తడిచిపోయింది. మూసాపేట, రాజాపూర్, జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ మండలాల్లో కల్లాల్లోని ధాన్యం తడిచిపోయింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తులేకలాన్ గ్రామంలో గాలివానకు నేలరాలిన మామిడి పంటను ఉద్యాన అధికారి నవీన మంగళవారం పరిశీలించారు. 35 మంది రైతులకు చెందిన 90 ఎకరాల్లో మామిడి పంటలకు నష్టం వాటిల్లిందని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా ధన్నూర్(బీ), బోథ్, మర్లపెల్లి ప్రాంతాల్లో జొన్న, మక్క, నువ్వుల పంటలు దెబ్బతిన్నాయి. బోథ్ మార్కెట్ యార్డులో రైతులు అమ్మకానికి తెచ్చిన శనగలు, మక్కలు, జొన్న కుప్పల కిందికి వర్షపు నీరు చేరింది. ధన్నూర్(బీ)లో వాగు ఒడ్డున నిల్వ ఉంచిన జొన్న కుప్పలు టార్ఫాలిన్లు గాలివానకు లేచిపోయాయి. నిర్మల్ జిల్లా భైంసాలో కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన మక్కలు తడిశాయి. ముథోల్లో మక్కజొన్న కోత కోసి కుప్పలు వేయడంతో తడిసి ముద్దయ్యాయి.