సూర్యాపేట, జనవరి 3 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ పాలనలో కాళేశ్వరం జలాలు వచ్చిన తర్వాత తుంగతుర్తి నియోజకవర్గంలో రైతులు వరికి ప్రత్యామ్నాయంగా ఏటా 1,500 ఎకరాల్లో ఆరుతడి పంటలు వేస్తూ వచ్చారు. ఈ సారి 850 ఎకరాల్లో పంట వేశారు. బీఆర్ఎస్ సర్కారులో కాళేశ్వరం జలాలు యాసంగికి డిసెంబర్ తొలివారంలో విడుదల చేయగా, ఈసారి జనవరిలో విడుదల చేశారు. పంటలకు నీళ్లు అందడంలేదు. పల్లి రైతులు బోర్లతో పంట పండించుకున్నా, పంట చేతికొచ్చే సమయంలో పల్లికాయ తీయడం కష్టంగా మారింది. రామన్నగూడెంలో రైతు భూక్యా సుందర్ బోర్ల నుంచి నీరు తెచ్చి పంటకు చల్లుతూ పంటను కాపాడుకున్నాడు.
ఎండుతున్న నార్లు.. రైతుల దిగాలు
నాగిరెడ్డిపేట, జనవరి 3: పోచారం ప్రాజెక్టు నుంచి నీటి విడుదల ప్రారంభించక పోవడంతో కళ్లముందే వాడిపోతున్న నారును చూసి రైతుల హృదయాలు తల్లడిల్లుతున్నాయి. కామారెడ్డి జిల్లా పోచారం ప్రాజెక్టు నుంచి ఆయకట్టు కింద రైతులు నార్లు పోసుకున్నారు. డిసెంబర్లోనే నీటిని విడుదల చేయాల్సి ఉండగా, ఇంకా ప్రారంభించ లేదు. దీంతో నాగిరెడ్డిపేట శివారులోని పోచారం ప్రధాన కాలువ కింద పోసిన తుకాలు ఎండిపోతున్నాయి. కండ్ల ముందే ఎండుతున్న వరి నారును కాపాడుకునేందుకు రైతులు తంటాలు పడుతున్నారు. ట్యాంకర్‌తో నీటిని తెచ్చి నారుమళ్లు తడుపుకొంటున్నారు. డబ్బులు పెట్టి ట్యాంకర్ నీటితో నారును కాపాడుకుంటున్నామని, అధికారులు వెంటనే పోచారం నీటిని విడుదల చేయాలని రైతు బడిగె లస్మయ్య కోరారు.