చేర్యాల, ఫిబ్రవరి 28 :సాగు నీళ్లు లేక సిద్దిపేట జిల్లా చేర్యాల ప్రాంతంలో పంటలు ఎండిపోతున్నాయి. ఇటీవల మద్దూరు మండలం నర్సాయపల్లి, కొమురవెల్లి మండలంలోని లెనిన్‌నగర్, కొమురవెల్లి మండల కేంద్రంలో వరిపంటలు ఎండిపోవడంతో పశువులకు వదిలిపెట్టారు. తాజాగా చేర్యాల పట్టణంతోపాటు చేర్యాల మండలంలోని చుంచనకోటలో వరి పొలాలు ఎండిపోతుండటంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. చుంచనకోట గ్రామానికి చెందిన సుగుణవ్వ తనకున్న రెండున్నర ఎకరాల్లో వరి సాగు చేయగా బోరుబావి నుంచి నీరు రాకపోవడంతో ఎండిన పంటను శుక్రవారం పశువులు మేతకు వదిలిపెట్టింది. ఈ విషయమై ‘నమస్తే తెలంగాణ’తో రైతులను పలుకరించగా.. గత పదేండ్లుగా పంటలు ఎండిపోయిన దాఖలాలు లేవని, బోర్లు బాగా పోసేవన్నారు. కాంగ్రెస్ వచ్చాక చెరువులు, కాలువలను నింపకపోవడంతో భూగర్భ జలాలు తగ్గి బోర్లు పోయక పంటలు ఎండిపోతున్నట్టు ఆవేదన వ్యక్తం చేశారు. పంటలు ఎండిపోతుండటంతో చేసేది లేక పశువులకు వదిలి పెట్టాల్సి వచ్చిందని చెప్తున్నారు. చేర్యాల-ఆకునూరు రహదారిలో రైతు అంజనేయులు సైతం ఎకరన్నర వరి పంట ఎండిపోవడంతో పైరును పశువులకు వదిలిపెట్టాడు.