పదేండ్ల కేసీఆర్ పాలనలో అలీసాగర్ లిప్టు ద్వారా పంటలకు పుష్కలంగా సాగునీరు అందింది. ఒక్క గుంట భూమి కూడా ఎండిన దాఖలాల్లేవు. అలీసాగర్ లిప్టు ద్వారా ఏటా రెండు పంటలు సంబురంగ పండించుకున్నం. వానకాలంలోపు లిప్టు ద్వారా పంటలు పండినయి. ఈ యాసంగిలో లిప్టు మీద ఆశలు పెట్టుకొని వరి సాగు చేస్తే అడియాశే అయింది. ఇప్పుడు పొట్టదశలో ఉన్న పంటలు నీళ్లందక ఎండిపోతున్నయి. దీనికి తోడు భూగర్భ జలాలు అడుగంటిపోయి బోరు బావుల నుంచి నీళ్లు వస్తలేవు. నారాయణపూర్ గ్రామానికి చెందిన రైతులు రమణారావు, ప్రభాకర్, సత్తార్, సాగర్ ఆవేదన
నవీపేట, మార్చి 8: యాసంగిలో రైతులను సాగునీటి కష్టాలు వెంటాడుతున్నాయి. పొట్టదశలో ఉన్న పంటలకు సాగునీరందక ఎండిపోతున్నాయి. కేసీఆర్ ఉన్నప్పుడు ఒక్క గుంట కూడా ఎండలేదని ఇప్పుడేమో వేసిన పంటంతా నీళ్లు లేక ఎండిపోతుంటే చూడలేకపోతున్నామని నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలోని వివిధ గ్రామాల రైతులు వాపోతున్నారు. అలీసాగర్ లిప్టు ద్వారా సాగునీటిని అందించి, ఎకరం కూడా ఎండకుండా చూడాలని ఇరిగేషన్ అధికారులను ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి ఆదేశించినా వారు పట్టించుకోవడం లేదని, ఫలితంగా నారాయణపూర్ గ్రామ శివారులో 40 ఎకరాలకు అలీసాగర్ సాగునీరు అందడంలేదని వాపోయారు.
నవీపేట మండలంలోని నారాయణపూర్‌కు చెందిన ప్రభాకర్ తనకున్న రెండున్నర ఎకరాల్లో వరి సాగు చేశాడు. అలీసాగర్ నీళ్లు ఎగువ భాగాన ఉన్న గ్రామాలకు అందినా, తమ గ్రామానికి నీరు రాకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన రమణారావు, చాకలి గంగ భూమయ్య, సాగర్, ఎస్ కే సత్తార్, సుంకరి ఆంజనేయులు, సాయిలు అనే రైతులకు చెందిన 40 ఎకరాలు పొట్ట దశలో ఎండిపోతుండటంతో జీర్ణించుకోలేకపోతున్నారు. ఎకరానికి రూ. 30 వేలు ఖర్చుచేశామని, ప్రస్తుత పరిస్థితులు చూస్తే కనీసం పెట్టుబడి కూడా రాని దుస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. వచ్చే మూడు రోజుల వరకు సాగునీరు అందక పోతే పంటలు ఎండిపోయి పశువులకు మేతగా వేయాల్సి వస్తుందని కన్నీంటి పర్యంతమవుతున్నారు. ఎస్సారెస్పీలో పుష్కలంగా నీరు ఉన్నా చివరి ఆయకట్టు వరకు అందక పోవడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
చివరి ఆయకట్టుకు లిఫ్ట్ నీరందిస్తున్నాం
అలీసాగర్ ఎత్తిపోతల చివరి ఆయకట్టుకు సాగునీరు అందిస్తున్నాం. నారాయణపూర్ ఆయకట్టు రైతులకు ఎగువభాగం వరకు వెళ్లి నీరు సాగు నీరు తెచ్చుకోవాలని సూచించాం. రైతులు కాలువలకు చిన్నచిన్న మరమ్మతులు చేయించుకుంటే సాగునీరు చివరి ఆయకట్టు వరకు చేరుతుంది.
-బాల్‌రాం, ఇరిగేషన్ ఈఈ