అన్నదాతపై ఒకవైపు ప్రకృతి పగబడితే.. కాంగ్రెస్ సర్కార్ కక్షగట్టింది. తీవ్ర వర్షాభావ పరిస్థితులు రైతును వెంటాడుతుంటే.. ఆదెరువు చూపాల్సిన ప్రభుత్వం ఆశనిపాతంగా మారింది. సాగునీటిని సరఫరా చేయలేక, బోరుబావులకు నిరంతరం కరెంటు సరఫరా చేయలేక సర్కార్ నిర్లక్ష్యం చూపుతున్నది. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా ఈ వానకాలం సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. వరి సాగుపై తీవ్ర ప్రభావం పడింది. ఆరుతడి పంటల సాగు కూడా అగమ్యగోచరంగా మారింది. -నీంకార్ వెంకటేశ్వర్రావు
మహబూబ్నగర్, జూలై 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా సగటు వర్షపాతం కూడా నమోదు కాలేదు. ఆశించినంత వర్షాలు కురిసే పరిస్థితి లేక ఈ వానకాలం సాగు విస్తీర్ణంపై తీవ్ర ప్రభావం పడింది. అన్ని జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదుకాక వర్షాధార పంటల పరిస్థితి కూడా అగమ్యగోచరంగా మారింది. ప్రభుత్వం ఊదరగొడుతున్నట్టుగా అరుతడి పంటలు సాగు చేయాలన్నా విద్యుత్తు కొరత రైతులను వేధిస్తున్నది. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 134135 లక్షల ఎకరాలు సాగు లక్ష్యం కాగా, ఈ ఏడాది జూలై రెండోవారం వరకు సుమారు 33 లక్షల ఎకరాల్లోనే ఈ వానకాలం పంటలు సాగైనట్టు ఒక అంచనా. జూలై చివరి నుంచి ఆగస్టు మధ్య వరకు సాగు విస్తీర్ణం వేగంగా పెరుగుతుందని, ఆరుతడి పంటలు సాగు చేయాలంటూ ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేస్తున్నది.
కలెక్టర్లు, వ్యవసాయ అధికారులు మండలాల వారీగా ఆరుతడి పంటల సాగుపై రైతులను చైతన్య పరుస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఆరుతడి పంటలు పండించినా ప్రభుత్వం కొంటదో? లేదోనన్న భయం కూడా రైతాంగాన్ని వెంటాడుతున్నది. ఈ సీజన్లో వ్యవసాయం చేసే కంటే వచ్చే ఆలస్యంగానైనా వర్షాలు పడితే ప్రాజెక్టుల్లో నీళ్లు ఉంటే యాసంగి సీజన్లోనైనా సాగు చేసుకోవచ్చని భావిస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రైతులు అంచనాలకు మించి సాగు చేసే పరిస్థితి ఉండేది. ఎరువులు, విత్తనాలు, విద్యుత్తు సరఫరాతోపాటు రైతుబంధు కూడా ఆసరా కావడంతో అన్నదాతలు ఆనందంగా పంటలు వేసేవారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో అందుకు భిన్నంగా పరిస్థితి తయారైంది. ఏ ఒక్క రైతు కూడా ప్రభుత్వంపై భరోసా పెట్టి వ్యవసాయం చేయలేని పరిస్థితి దాపురించింది. మరోవైపు అక్కడక్కడా తొలకరి వర్షానికి నాటిన పత్తి మొలకులు వర్షాభావ పరిస్థితుల్లో వాడిపోతున్నాయి. వర్షాలు కురిస్తే తప్ప పప్పు ధాన్యాల సాగుకు రైతులు ముందుకొచ్చే పరిస్థితి లేదు.
12లక్షల ఎకరాల్లోనే వరిసాగు
దేశంలోనే వరి ఉత్పత్తిలో ప్రథమస్థానం సాధించిన తెలంగాణ రికార్డు సాధించింది. ఇదంతా గతం.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు మద్దతు ధర లేక, ఎరువులు, విత్తనాల కొరత, విద్యుత్తు కోతలు, పంట పెట్టుబడికి అప్పులు చేయడం తదితర కారణాలతో వానకాలం సీజన్లో వరిసాగు గణనీయంగా తగ్గింది. తాజా వ్యవసాయ శాఖ అంచనాల ప్రకారం ప్రస్తుతం రాష్ట్రంలో కేవలం 12 లక్షల ఎకరాల్లో మాత్రమే వరి సాగు చేశారని అంచనా. ప్రతి ఏటా వానకాలం సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 60 లక్షల ఎకరాలకు పైబడి వరి పంట సాగయ్యేది. ప్రాజెక్టులు, చెరువులు, బోరుబావులు, కాలువల కింద విస్తృతంగా వరిని సాగు చేసేవారు. ఫలితంగా తెలంగాణ ధాన్యాగారంగా మారేది. ప్రభుత్వం ఈ వానకాలం నుంచి 7 రకాల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేస్తామని ప్రకటించడం కూడా వరిసాగు విస్తీర్ణం తగ్గడానికి మరో కారణంగా తెలుస్తున్నది. గతంలో కష్టపడి పండించిన పంటను కూడా రేవంత్ ప్రభుత్వం సరిగా కొనుగోలు చేయకపోవడంతో కల్లాల్లోనే వర్షాలకు తడిచి తీవ్రంగా నష్టపోయారు. బోనస్ ఇస్తామని ప్రకటించి చేతులెత్తేయడంతో రైతాంగం మద్దతు ధర లభించక దళారులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం ఆశించిన స్థాయిలో కొనుగోలు చేయకపోవడంతోపాటు కేంద్రం నిర్దేశించిన లక్ష్యానికి మాత్రమే కొంటామని ప్రకటించడంతో రైతులంతా తీవ్రంగా నష్టపోయారు.
పడిపోయిన పత్తిసాగు
ప్రతి వానకాలం 52 లక్షల ఎకరాల్లో సాగయ్యే పత్తి.. ప్రస్తుతం 18 లక్షల ఎకరాలకు పడిపోయిందని అంచనా. అడపా దడపా పడిన వర్షాలకు పత్తి విత్తనాలు మొలకెత్తినప్పటికీ మరో వారం, 15 రోజుల్లో ఆశించిన మేరకు వర్షాలు పడకపోతే మొలకలు కూడా పూర్తిగా ఎండిపోయే ప్రమాదం ఉన్నదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటివరకు రైతులు వర్షాధార పంటల విత్తనాలు చల్లనేలేదు. కనీసం జూలై, ఆగస్టులోనైనా వర్షాలు ఆశించిన మేర కురిస్తే పప్పుధాన్యాలతో పాటు మక్కజొన్న వేసే పరిస్థితి ఉంటుందని రైతులు అంటున్నారు. ఒకవేళ అది కూడా లేకపోతే ఆ పంటల సాగు కూడా పూర్తిగా తగ్గే ప్రమాదం ఉన్నది. కూరగాయల సాగుకు కూడా రైతులు ధైర్యం చేయడం లేదు. బోరు బావుల కింద వేసిన పంటలతో విద్యుత్తు కోతలు రైతులను కుదేలు చేస్తున్నాయి.
రెండుసార్లు విత్తనాలు చల్లినా..
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం ఎర్రగుట్ట గ్రామంలో తనకున్న మూడెకరాల్లో రైతు ఆత్రం లక్ష్మణ్ జూన్లో కురిసిన వర్షాలకు మొదటిసారి మూడు బ్యాగులు పత్తి, కంది విత్తనాలు వేశాడు. వర్షాలు లేక అవి మొలకలు రాలేదు. దీంతో మరోసారి మరో మూడు బ్యాగులు తెచ్చి విత్తనాలు వేశాడు. ప్రస్తుతం మొలకలు వచ్చినా వర్షంలేక వాడిపోయే పరిస్థితి నెలకొన్నది. ఎలాంటి నీటి సదుపాయం లేదు. వర్షం పడితేనే పంట.. లేకుంటే లేదు. మొదటిసారి విత్తనాలు, యూరియా, డీఏపీ సహా అన్నీ కలిపి రూ.15 వేల నష్టమొచ్చింది. మళ్లీ రూ.15 వేలు పెట్టుబడి పెట్టి పంట వేయగా వర్షాలు కురువడం లేదని రైతు లక్ష్మణ్ ఆందోళన చెందుతున్నాడు.
15 ఎకరాల్లో పత్తి మొలకెత్తలే..
ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం హస్నాపూర్ గ్రామంలో వర్షాల్లేక రైతు గోక కిష్టారెడ్డి రెండోసారి పత్తి విత్తనాలు వేశాడు. మొలకెత్తిన మొలకలు తడి అందక ఎండిపోతున్నాయి. మెదటిసారి 15 ఎకరాల్లో పత్తి విత్తనాలు వేస్తే అవి మొలకెత్తలేదని, దీంతో రూ.16 వేలు నష్టపోయినట్టు రైతు ఆవేదన వ్యక్తంచేశాడు. మరోసారి విత్తనాలు వేసినట్టు చెప్పారు.
సాగుకు జంకుతున్న రైతాంగం
ఎల్ నినో ప్రభావంతో వానకాలం సాగు పరిస్థితి దయనీయంగా మారింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఈ వానకాలం సీజన్లో సాగువిస్తీర్ణం 15 శాతానికి కూడా మించలేదు. కేవలం బోరుబావుల కింద మాత్రమే ధైర్యం చేసి సాగు చేస్తున్నారు. నారుమడులు వేసుకొన్న కొన్నిచోట్ల నీళ్లందక ఎండిపోతున్నాయి. ఉమ్మడి జిల్లాలో 65 మండలాల్లో వర్షాధార పంటలే వేయలేదంటే పరిస్థితి ఊహించవచ్చు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 46,200 ఎకరాల్లో పత్తి, 1,145 ఎకరాల్లో మక్క, కందులు 180 ఎకరాల్లోనే సాగు చేశారు. పెద్దపల్లి జిల్లాలో 80,000 ఎకరాల్లో వరి పంట సాగైంది. పత్తి 42,000 ఎకరాల్లో, ఆరుతడి పంటలు 12,000 ఎకరాల్లో సాగుచేశారు. కరీంనగర్ జిల్లాలో 2,79,000 ఎకరాల వరి సాగుకు గాను, ఇప్పటివరకు 54,003 ఎకరాల్లోనే సాగైంది. పత్తి 38,506 ఎకరాల్లో, 2,366 ఎకరాల్లో మక్కు, కంది 456 ఎకరాల్లో సాగయింది. జగిత్యాల జిల్లాలో వరి 3.15 లక్షల ఎకరాల్లో సాగుకావాల్సి ఉండగా, ఇప్పటివరకు 11 వేల ఎకరాల్లోనే నాట్లు వేశారు. మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాలో ఇప్పటివరకు జిల్లాలో 2,103 ఎకరాల్లోనే వరి సాగయింది. నల్లగొండ జిల్లావ్యాప్తంగా ఆరుతడి పంటలు సాగు చేయడానికి రైతులు ఆసక్తి చూపడమే లేదు. పత్తి చేన్లలో అంతర పంటగా 1,700కు పైగా ఎకరాల్లో కది పంట సాగుచేశారు. సూర్యాపేట జిల్లాలో వానకాలంలో పెసర 1,210 ఎకరాల్లో, వేరుశనగ 122 ఎకరాల్లో రైతులు సాగుచేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మరో వారం రోజుల్లో వర్షాలు పడకుంటే సాగయిన పంటలు ఎండుముఖం పట్టే ప్రమాదం ఉన్నది.