Runa Mafi | హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పంట రుణమాఫీ గందరగోళంగా మారింది. అర్హత ఉన్న రైతులు కూడా రుణమాఫీకి నోచుకోవటం లేదు. అడ్డగోలు నిబంధనలతో కోతలు పెడుతూ మెజారిటీ రైతులకు ప్రభుత్వం మొండిచేయి చూపిస్తున్నది. దీంతో ప్రభుత్వ తీరుపై రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు రుణమాఫీ ఎందుకు కాలేదు? అంటూ ప్రశ్నిస్తున్నారు. అన్ని అర్హతలు ఉన్నప్పటికీ రుణమాఫీ ఎందుకు కాలేదో చెప్పాలంటూ ఏఈవోలు, బ్యాంకు అధికారులను నిలదీస్తున్నారు. కొన్నిచోట్ల రైతులు బ్యాంకుల ముందు ధర్నాలు చేస్తున్న పరిస్థితి ఏర్పడింది. మొన్న వరంగల్‌లో, నేడు ఆసిఫాబాద్‌లో రైతులు బ్యాంకుల ఎదుట ధర్నాకు దిగా రు. రైతులకు సమాధానం చెప్పలేక అధికారులు చేతులెత్తేస్తున్నారు. పైనుంచి వచ్చిన జాబితా ప్రకారమే రుణమాఫీ చేస్తున్నామని చెప్తున్నారు. దీంతో రుణమాఫీ ప్రక్రియ రైతుల్లో గందరగోళం నింపింది. తమకు ఎందుకు రుణమాఫీ కాలేదో తెలియక రైతులు అయోమయానికి, ఆందోళనకు గురవుతున్నారు.
రైతులు 70 లక్షలు.. మాఫీ చేసేది 32 లక్షలకే
రుణమాఫీకి సంబంధించి కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయని, ఇందులో 70 లక్షల మందికి రుణ ఖాతాలు ఉన్నాయని, వీరందరికీ రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు. కానీ అమల్లోకి వచ్చేసరికి మాత్రం అర్హుల సంఖ్యలో అడ్డంగా కోతపెట్టేశారు. సీఎం చెప్పిన ప్రకారం 70 లక్షల మందికి రుణమాఫీ కావాలి. కానీ ప్రభుత్వం కేవలం 32 లక్షల మందికే రుణమాఫీ చేస్తున్నట్టు తెలిసింది. ఇందుకోసం ప్రభుత్వం అత్యంత కఠిన నిబంధనలు అమలు చేసినట్టు సమాచారం. అంటే దాదాపు అర్హులైన 40 లక్షల మంది రైతులకు రుణమాఫీలో ప్రభుత్వం మొండి చేయి చూపింది.
మూడు నిబంధనలతో కోతలు
రుణమాఫీకి పాస్ పుస్తకమే ప్రామాణికమన్న సీఎం రేవంత్‌రెడ్డి ఆ తర్వాత అత్యంత కఠిన నిబంధనలను అమలు చేస్తున్నారు. ముఖ్యంగా మూడు నిబంధనల ఆధారంగా రుణమాఫీని అమలు చేస్తున్నట్టు తెలిసింది. రేషన్‌కార్డు లేని కుటుంబాలకు రుణమాఫీ చేయడం లేదు. దీంతోపాటు ఆదాయ పన్ను చెల్లించే వారికి కూడా రుణమాఫీ జాబితాలో చోటు దక్కలేదు. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు కూడా రుణమాఫీలో ప్రభుత్వం చేయి చూపింది. ఈ మూడు నిబంధనల ఆధారంగా ఆయా కుటుంబాల్లోని ఒక్కరికి కూడా రుణమాఫీ చేయడం లేదు. ఈ మూడు నిబంధనల కారణంగానే మెజారిటీ రైతులు రుణమాఫీకి దూరమైనట్టు తెలిసింది. ప్రభుత్వం మాత్రం ఎలాంటి నిబంధనలు అమలు చేయలేదని చెప్తుండటం గమనార్హం. మరి ఎలాంటి నిబంధనలు అమలు చేయనప్పుడు అర్హుల సంఖ్య ఎందుకు తగ్గిందనే ప్రశ్నలకు ప్రభుత్వం నుంచి సమాధానం మాత్రం రావడం లేదు.
బడ్జెట్‌పై పూటకో మాట
రుణమాఫీ బడ్జెట్ పై ప్రభుత్వం పూటకో మాట మాట్లాడుతుండటం అనుమానాలకు తావిస్తున్నది. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో రుణమాఫీకి రూ.40 వేల కోట్లు అవసరమవుతాయని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. తాజాగా దీన్ని రూ.31 వేల కోట్లకు తగ్గించారు. ఇదిలా ఉంటే బడ్జెట్లో ప్రభుత్వం రూ.26 వేల కోట్లు మాత్రమే కేటాయించింది. అంచనాలకు, అమలు లెక్కలకు, బడ్జెట్ కేటాయింపులకు పొంతన లేకుండా ఉన్నది. ఫైనల్‌గా రుణమాఫీకి రూ.31 వేల కోట్లు అవసరం అవుతాయని చెప్పిన ప్రభుత్వం.. బడ్జెట్లో రూ.26 వేల కోట్లే పెట్టడమేమిటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అంటే అవసరం కన్నా రూ.5000 కోట్లు తక్కువ కేటాయించింది. ఈ నేపథ్యంలో ఈ మేరకు లబ్ధిదారుల సంఖ్యలో కోతపెట్టడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.