Crop Insurance | హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): ఫసల్ బీమా అమలుపై రాష్ట్ర ప్రభు త్వం నాలుగు నెలల నుంచి చర్చిస్తూనే ఉన్న ది. ఇప్పటివరకూ ఈ ప్రక్రియ టెండర్ వరకు వెళ్లకపోవడం విమర్శలకు తావిస్తున్నది. అధికారులు విధి విధానాలు సిద్ధం చేసి సీఎం రేవంత్‌రెడ్డి వద్దకు ఫైలు పంపినా.. నెల రోజులుగా అది పెండింగ్‌లో ఉన్నట్టు సమాచారం. మొన్నటివరకు వర్షాలు లేక ఇబ్బంది పడిన రైతులను ఇప్పుడు కుండపోత వర్షాలు ఆగం చేస్తున్నాయి. కాగా ప్రభుత్వం పంట నష్టంపై ఇచ్చే పరిహారంపై కూడా అనుమానాలు వ్య క్తమవుతున్నాయి. సీజన్ ముగుస్తున్నా రైతు భరోసా అందలేదు.
ప్రభుత్వ సహకారం లేక, అటు కాలం కలిసిరాక రైతన్న అరిగోస పడు తున్నాడు. రాష్ట్రవ్యాప్తంగా 15 లక్షల నుంచి 20 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టు వ్యవసాయ శాఖ వర్గాల అంచనా. ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్, వరంగల్‌తోపాటు నిర్మల్ జిల్లాల్లో భారీగా పంట నష్టం జరిగినట్టు వ్యవసాయ శాఖ అంచనా వేసినట్టు తెలిసింది. వ్యవసాయ శాఖ ప్రాథమి క అంచనా ప్రకారం 4.15 లక్షల ఎకరాల్లో మాత్రమే పంటలు దెబ్బతిన్నాయని ప్రభు త్వం వెల్లడించింది. ప్రభుత్వ లెక్కలను రైతు సంఘాలు తప్పుపడుతున్నాయి. పరిహారాన్ని తప్పించుకోవడానికే నష్టాన్ని తక్కువగా చూపిస్తున్నారనే విమర్శలొస్తున్నాయి. పంట నష్టంపై వాస్తవ లెక్కలు తెప్పించి, వారందరికీ సాయం చేయాలని రైతు సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.
కలిసిరాని కాలం.. దక్కని ప్రభుత్వ భరోసా
ఈ ఏడాది దెబ్బ మీద దెబ్బ మాదిరిగా కాలం కలిసిరాక, ప్రభుత్వం నుంచి భరోసా దక్కక రైతులు ఆగమైపోతున్నారు. మొన్నటివరకు వర్షాలు లేక, ఇప్పుడు కుంభవృష్టితో నష్టపోతున్నారు. ప్రభుత్వం నుంచి రైతుభరోసా దక్కక, రుణమాఫీ సరిగ్గా అమలుకాక ఇలా అన్ని విధాలుగా రైతులు ఇబ్బందిపడుతున్నారు. సకాలంలో సరైన వర్షాలు కురవకపోవడంతో గత సంవత్సరంతో పోల్చితే ఈసారి దాదాపు 10 లక్షల ఎకరాల్లో పంటల సాగు విస్తీర్ణం తగ్గింది. ఇప్పుడు కుంభవృష్టితో సాగైన పంటలు కూడా దెబ్బతింటున్నాయి. ఈ విధంగా రైతులపై ప్రకృతి పగబడితే, వారిని ఆదుకునే విషయంలో ప్రభుత్వం కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదనే విమర్శలొస్తున్నాయి. పంటల సాగు కోసం ఎప్పుడో జూన్‌లో ఇవ్వాల్సిన రైతుభరోసా, సీజన్ ముగుస్తున్నా అతీగతీ లేకుండా పోయింది. రుణమాఫీలోనూ కోతలు పెట్టిన ప్రభుత్వం 50% మందికే మాఫీ చేసింది. ఇప్పటివరకు 22 లక్షల మందికే మాఫీ అయినట్టు ప్రభుత్వమే చెప్తున్నది. రైతులకు ప్రకృతి చేసిన నష్టంతో పోల్చితే ప్రభుత్వం చేసిన నష్టమే ఎక్కువనే విమర్శలొస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం పూర్తిస్థాయిలో పంట నష్ట పరిహారంతోపాటు రైతుభరోసా చెల్లించాలని రైతులు కోరుతున్నారు.
నాలుగు నెలలుగా నాన్చుడే
‘ఈ వానకాలం సీజన్ నుంచే రైతులకు ఉచిత పంటల బీమా అమలు చేయబోతు న్నాం. పంట నష్టపోయిన ప్రతి రైతుకూ పరిహారం అందిస్తాం..’ ఇదీ పంటల బీమా పథ కం అమలుపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పిన మాట. కానీ, మంత్రి మాటలు నీటి మూటలుగానే మిగిలిపోయాయి. ఈ సీజన్‌కు పంటల బీమా అమలు లేనట్టేనని వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే ఆలస్యమైందని, రానున్న యాసంగి సీజన్ నుంచి అమలుకు చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు. దీంతో ప్రస్తుతం కురుస్తున్న కుండపోత వర్షాలతో జరిగిన పంట నష్టానికి బీమా పరిహారం దక్కే అవకాశం లేదు. ఫసల్ బీమా అమలుపై ప్రభుత్వం నాలుగు నెలల నుంచి చర్చిస్తూనే ఉన్నది. ఇప్పటివరకూ ఈ ప్రక్రియ టెండర్ వరకు వెళ్లకపోవడం విమర్శలకు తావిస్తున్నది. అధికారులు విధి విధానాలు సిద్ధం చేసి సీఎం వద్దకు ఫైలు పంపించినట్టు తెలిసింది. నెల రో జులుగా ఆ ఫైలు పెండింగ్‌లో ఉన్నట్టు సమాచారం. వారం క్రితం సీఎం సంతకం చేసినప్పటికీ, వ్యవసాయ అధికారులు, ఆ తర్వాత మంత్రి అందుబాటులో లేకపోవడంతో ఆ ప్రక్రియ అక్కడే నిలిచిపోయింది. దీంతో ఈ సీజన్ ముగిసింది కాబట్టి వచ్చే సీజన్ నుంచే అమలు చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు వ్యవసాయ శాఖలో చర్చ జరుగుతున్నది.
ఏప్రిల్ పంట పరిహారం ఇవ్వని ప్రభుత్వం
ఈ ఏడాది మార్చి, ఏప్రిల్‌లో కురిసిన అకాల వర్షాలు పంటలు భారీగా దెబ్బతీశాయి. మార్చి లో కురిసిన వర్షాలతో 15,814 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు ప్రభుత్వం గుర్తించింది. ఎకరా కు రూ.10 వేల చొప్పున పరిహారం ప్రకటించి చెల్లించింది. ఏప్రిల్‌లోనూ 3,120 ఎకరాల్లో పంటనష్టం జరిగినట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఈ రైతులకు కూడా ఎకరాకు రూ.10వేల పరిహారం చెల్లిస్తామని ప్రకటించింది. కానీ, ఇప్పటివరకూ ఆ పరిహారాన్ని రైతులకు చెల్లించలేదు. దీంతో ప్రభుత్వం రైతులకు పరిహారం ఎగ్గొంటిందనే విమర్శలొస్తున్నాయి.
ఫసల్ బీమా లేదు.. పరిహారం రాదు
ఇప్పటికే ఫసల్ బీమాను అమలు చేసి ఉంటే రైతులకు ఈ విపత్తు సమయంలో ఎంతగానో అండగా ఉండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎకరాకు రూ.10 వేల చొప్పున సాయం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ పరిహారం ఏ మూలకు సరిపోతుందనే విమర్శలొస్తున్నాయి. ఒకవేళ ఫసల్ బీమా ఉంటే, ప్రతి రైతుకూ, ప్రతి పంటకూ జరిగిన నష్టం మేరకు పరిహారం వచ్చేదని, రైతుకు కొంత భరోసాగా ఉండేదనే అభిప్రాయాలున్నాయి. వర్షాకాలం సీజన్లో ఎప్పుడో ఒకప్పుడు భారీ వర్షాలు, వరదలు వస్తాయనే విషయం తెలిసినప్పటికీ, ప్రభుత్వం ముందస్తుగా పంటల బీమాను ఎందుకు అమలు చేయలేదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.