హైదరాబాద్, ఏప్రిల్17 (నమస్తే తెలంగాణ) : అసలు వదిలి కొసరు పెట్టినట్టున్నది కాంగ్రెస్ సర్కార్ తీరు. కేవలం కులాల వారీగా విద్య, ఉద్యోగ, ఆదాయ, సామాజిక స్థితిగతుల గణాంకాలనే సర్వే నివేదికలో ప్రకటించి చేతులు దులుపుకొన్నది. అసలు బీసీ వర్గాల్లో కీలకమైన రాజకీయ వెనుకబాటుతనంపై అధ్యయన గణాంకాలు వెల్లడించకపోవడం చర్చనీయాంశంగా మారింది. వాస్తవంగా కులగణనను నిర్వహించిందే రాజకీయ రిజర్వేషన్ల నిర్ధారణ కోసం. కానీ ఆ గణాంకాలనే సర్కార్ బహిర్గతం చేయకపోవడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై బీసీ కులసంఘాల్లోనూ తీవ్ర చర్చ కొనసాగుతున్నది. సర్కార్ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం గత నవంబర్‌లో రాష్ట్రంలో నిర్వహించిన ఇంటింటి సర్వే (సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే 2024) నివేదికను తాజాగా విడుదల చేసింది. ఆ నివేదికలో కీలకమైన రాజకీయ డాటాను మాత్రం సర్కార్ వెల్లడించలేదు. కేవలం రాష్ట్రంలోని 242 కులాలు, ఉపకులాల వారీగా జనాభా లెక్కలు, ఆర్థిక, సామాజిక, విద్యా, ఉద్యోగ, ఉపాధి స్థితిగతులనే బహిర్గతం చేసింది. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఇచ్చిన హామీని అమలు చేసేందుకు, అందులో భాగంగా రాజకీయ వెనుకబాటు తనాన్ని నిర్ధారించేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన నిర్వహించింది. ఇంటింటి సర్వే పత్రంలోనూ రాజకీయ అవకాశాలు, ప్రాతినిధ్యాలకు సంబంధించి అంశాలను సైతం పొందుపరిచింది.
సర్వే ఫామ్‌లో 46, 46(ఏ), 46(బీ), 46(సీ), 46(డీ), 46(ఈ), 46(ఎఫ్), 47వ ప్రశ్నలు వాటికి సంబంధించినవే. ప్రజాప్రతినిధిగా సభ్యత్వం ఉన్నదా? గతంలో కూడా పనిచేశారా? పనిచేస్తే ఆ హోదా ఏమిటి? ఎన్ని పర్యాయాలు చేశా రు? తదితర వివరాలు సేకరించింది. కానీ, తాజా నివేదికలో ఆ గణాంకాలను ప్రకటించనేలేదు. ఏ కులం ఎక్కువ రాజకీయ అవకాశాలు పొందుతున్నది? బీసీ, ఎస్సీ, ఎస్టీల్లో ఎవరు ఏ మేరకు రాజకీయ అవకాశాలు పొందుతున్నారనేది స్పష్టం చేయనేలేదన్నదే చర్చనీయాంశంగా మారింది.
స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల స్థిరీకరణకు సుప్రీంకోర్టు, హైకోర్టు మార్గదర్శకాల మేరకు ప్రభుత్వం బూసాని వెంకటేశ్వర్లు నేతృత్వంలో డెడికేటెడ్ కమిషన్‌ను నియమించింది. ఇంటింటి సర్వే పూర్తయిన తర్వాత ఆ గణాంకాలను కమిషన్‌కు అందించింది. ఆ కమిషన్ సైతం బీసీ రిజర్వేషన్ల సర్వే గణాంకాలను అధ్యయనం చేసింది. బీసీ రిజర్వేషన్లను స్థిరీకరిస్తూ సర్కార్‌కు నివేదికను సమర్పించింది. కమిషన్ సిఫార్సుల మేరకు బీసీలకు విద్యా, ఉద్యోగ, ఉపాధి రంగాలతోపాటు, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం తొలుత అసెంబ్లీలో బిల్లులను ఆమోదించింది. ఆ సమయంలోనూ కమిషన్ నివేదికను మాత్రం సర్కార్ బయటపెట్టలేదు. మరోసారి ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది. గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉండగానే జీవో 9ని జారీచేసింది. కానీ ఆ డెడికేటెడ్ కమిషన్ నివేదికను మాత్రం వెల్లడించింది లేదు. జీవో 9పై పలువురు హైకోర్టును ఆశ్రయించారు. అది విచారణలో ఉండగానే కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ జీవో 46ను జారీ చేసింది. బీసీలకు కల్పించిన 42శాతం రిజర్వేషన్లను మరోసారి కుదించింది. ఆ సందర్భంలోనూ డెడికేటెడ్ కమిషన్ సిఫార్సుల మేరకేనని ఉటంకించింది. అంతే తప్ప ఆ సందర్భంలోనూ నివేదికను బహిర్గతం చేయలేదు.
డెడికేటెడ్ కమిషన్ ఏ ప్రాతిపదికన సిఫార్సులు చేసిందనేది ఎవరికీ అంతుబట్టని విషయం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీల్లోని కులాలవారీగా జనాభా వివరాలు, ఆర్థిక స్థితిగతులు, ఏ కులం అధికంగా రాజకీయ అవకాశాలు పొందింది? ఏ కులం తక్కువ అవకాశాలు పొందింది? అన్న వివరాలను వెల్లడించనేలేదు. కమిషన్ నివేదికను బహిరంగ పరిచారా? అభ్యంతరాలు స్వీకరించారా? అని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. అప్పుడూ వెల్లడించలేదు. తాజాగా నివేదికను వెల్లడించిన ప్రభుత్వం కమిషన్ నివేదికను మాత్రం ఇప్పటికీ గోప్యంగానే ఉంచింది. అందులో ఆంతర్యమేమిటని బీసీ కులసంఘాలు ప్రశ్నిస్తున్నాయి.