హైదరాబాద్, జనవరి 31 (నమస్తే తెలంగాణ): ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారంలో పోలీసులు మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు సిట్ ఇచ్చిన నోటీసుకు చట్టబద్ధత లేదని గతంలో పలు కోర్టులు ఇచ్చిన తీర్పులను బట్టి వెల్లడవుతున్నది. వేర్వేరు హైకోర్టులే కాకుండా దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా ఇచ్చిన తీర్పులకు భిన్నంగా సిట్ నోటీసు ఉన్నట్టు తెలుస్తున్నది. పౌరుడి వయసు 65 ఏండ్లు అంతకంటే ఎకువ ఉన్నవారిని విచారణ చేయాలంటే సీఆర్పీసీలోని సెక్షన్ 160 ప్రకారం పోలీసులు అనుసరించాల్సిన విధానంపై స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయి.
ఈ విషయాన్ని తొలి నోటీసులో ప్రస్తావించిన పోలీసులు.. రెండో నోటీసులో అందుకు విరుద్ధంగా కేసీఆర్ ఉండే ఎర్రవల్లిలోని నివాసానికి వెళ్లి విచారణ చేయడానికి నిరాకరించడం కోర్టు తీర్పులను తుంగలో తొకడమేనని న్యాయవర్గాలు చెప్తున్నాయి. హైదరాబాద్‌లోని నందినగర్ ఇంటిగోడకు శుక్రవారం రాత్రి పోలీసులు రెండో నోటీసు అతికించడం చట్ట వ్యతిరేకమని అంటున్నారు. నందినగర్‌లోని ఇంట్లోనే ఆదివారం మధ్యా హ్నం 3 గంటలకు విచారిస్తామని, అందుబాటులో ఉండాలని సిట్ పోలీసులు పేరొనడం రాజ్యాంగ ధర్మాసనాల తీర్పులను కాలరాయడమేనని తప్పుపడుతున్నారు. వేర్వేరు హైకోర్టులు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు ఇలా ఉన్నాయి..
క్రిమినల్‌ను విచారించే సందర్భంలో కూడా పోలీసు అధికారుల పరిధికి సంబంధించి సీఆర్పీసీలోని 160 సెక్షన్లో స్పష్టమైన పరిమితులు ఉన్నాయని ఢిల్లీ హైకోర్టు తేల్చిచెప్పింది. తమ పోలీస్‌స్టేషన్ పరిధిలో లేదా పకనున్న పోలీస్స్టేషన్ల పరిధిలో నివాసం ఉండే వాళ్లను విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేయవచ్చునని స్పష్టం చేసింది. ఈ పరిమితులను అతిక్రమించి జారీచేసిన సమన్లకు చట్టబద్ధత ఉండదని తెలిపింది. జమ్ముకశ్మీర్‌లోని పంపోర్ సబ్‌డివిజనల్ పోలీస్‌ఆఫీసర్ జారీచేసిన సమన్లను ఢిల్లీ హైకోర్టు రద్దుచేసింది. జర్నలిస్టులు జంషెద్ ఆదిల్‌ఖాన్ తదితరులు దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై విచారించిన ధర్మాసనం సెక్షన్ 160కు ఉన్న చట్ట పరిధిని వివరించింది.
కొవిడ్-19 మహమ్మారి సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలను డబ్బు తీసుకుని దత్తతకు ఇస్తున్న వ్యవహారంపై పిటిషనర్ కథనం పత్రికలో ప్రచురితమైంది. దీనిపై పుల్వామా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ చేసిన ఫిర్యాదు ఆధారంగా జమ్ముకశ్మీర్‌లోని పంపోర్ పీఎస్‌లో కేసు నమోదైంది. కేసు దర్యాప్తులో భాగంగా, ఇండియాటుడే గ్రూప్ న్యూస్ డైరెక్టర్‌కు పోలీసులు నోటీసులు జారీచేశారు. తరువాత పోలీసు అధికారులు నోయిడాలోని టీవీ టుడే నెట్వర్ కార్యాలయానికి వెళ్లి సీడీని స్వాధీనం చేసుకున్నారు. పంపోర్ డీఎస్పీ సీఆర్పీసీ సెక్షన్ 160 కింద పిటిషనర్లకు నోటీసులు జారీచేశారు. 2 రోజుల్లోగా విచారణకు హాజరుకావాలని పేరొన్నారు. తాము ఢిల్లీలో నివాసం ఉంటామని, అది జమ్ముకశ్మీర్ పోలీస్‌స్టేషన్ పరిధికి పూర్తిగా వెలుపల అని, సెక్షన్ 160 కింద విచారణకు పిలువడం చెల్లదని పేర్కొంటూ హైకోర్టులో జర్నలిస్టులు పిటిషన్ దాఖలుచేశారు.
దీనిపై విచారణ జరిపిన హైకోర్టు సెక్షన్ 160 ప్రకారం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉన్న వ్యక్తులనే విచారణకు పిలువగలరని, జమ్ముకశ్మీర్‌లో నమోదైన కేసులో ఢిల్లీలో ఉన్న వాళ్లను పిలువడానికి వీల్లేదని తీర్పు చెప్పింది. తమ పరిధిలో లేని వ్యక్తులను హాజరుకావాలని ఆదేశించే అధికారం పోలీసులకు లేదని తేల్చిచెప్పింది. ఢిల్లీ నివాసులైన పిటిషనర్లకు జమ్ముకశ్మీర్‌లోని పంపోర్ పోలీసు అధికారి సెక్షన్ 160 కింద సమన్లు జారీచేయడం అధికార పరిధిని అతిక్రమించడమేనని తీర్పు వెలువరించింది.
హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు కూడా సీఆర్పీసీ సెక్షన్ 160 పరిధిపై కీలక తీర్పు వెలువరించింది. కృష్ణన్ బాన్స్ భదూర్ తదితరులు దాఖలు చేసిన కేసులో ఉత్తర్వులు వెలువరించింది. సిమ్లా పోలీసు అధికారులు ఒక కేసు దర్యాప్తునకు హాజరుకావాలని సీఆర్పీసీ సెక్షన్ 160 కింద ఆదేశించడాన్ని తప్పుపట్టింది. ఢిల్లీలో ఉన్న పిటిషనర్లకు నోటీసులు ఇవ్వడాన్ని ఆక్షేపించింది. సిమ్లా లేదా దానికి ఆనుకుని ఉన్న పోలీస్ స్టేషన్ పరిధిలో పిటిషనర్లు లేరు కాబట్టి 160 నోటీసు చెల్లదని తేల్చి చెప్పింది. సెక్షన్ 160 సీఆర్పీసీ పరిమితులను పోలీసులు ఉల్లంఘించారని పేర్కొంది. సెక్షన్ 160 కింద ఢిల్లీలో నివాసం ఉండే పిటిషనర్లకు నోటీసులు జారీచేయడాన్ని రద్దుచేసింది. ఆ ఉత్తర్వులు చట్టబద్ధమైనవిగా పరిగణించలేమని తెలిపింది. చట్టం నిర్దేశించిన భౌగోళిక పరిమితులకు అనుగుణంగానే 160 సెక్షన్ అమలు చేయాలని పేరొంది. దీంతో, పిటిషనర్లపై కొనసాగుతున్న కేసులు రద్దయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు తాజాగా 2025లో సీఆర్పీసీ సెక్షన్ 160పై కీలక తీర్పు వెలువరించింది. నోయిడాకు చెందిన వీడీ మూర్తిని ఒక కేసులో సాక్షిగా విచారణకు హాజరుకావాలని మంగళగిరి పోలీసులు సెక్షన్ 160 కింద నోటీసులు ఇవ్వడాన్ని తప్పుపట్టింది.
సీఆర్పీసీ సెక్షన్ 41-ఏ (ప్రస్తుతం బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 35) కింద జారీచేసే నోటీసులను వాట్సాప్ లేదా ఇతర ఎలక్ట్రానిక్ మార్గాల ద్వారా పంపడం చట్టబద్ధం కాదనే కేసులో సుప్రీంకోర్టు.. సెక్షన్ 160 గురించి స్పష్టమైన మార్గదర్శకాలను జారీచేసింది. సతేందర్‌కుమార్ యాంటిల్ వర్సెస్ సీబీఐ కేసులో గతంలో ఇచ్చిన తీర్పు అమలుపై దాఖలైన అనుబంధ పిటిషన్‌పై ఆదేశాలిచ్చిం ది. సెక్షన్ 41-ఏ (బీఎన్ఎస్ఎస్ సెక్షన్-35) కింద నోటీసుల జారీపై పోలీసు శాఖలకు నిర్దిష్ట మార్గదర్శకాలు జారీచేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ క్రమంలోనే సీఆర్పీసీలోని సెక్షన్ 160, సెక్షన్ 175 (ప్రస్తుతం బీఎన్ఎస్ఎస్లోని సంబంధిత నిబంధనలు) కింద నోటీసులపై కూడా నిర్దిష్ట మార్గదర్శకాలు జారీచేసింది.
సుప్రీంకోర్టు ఆదేశాల అమలును నిరంతరం పర్యవేక్షించేందుకు, ప్రతి హైకోర్టులోని సంబంధిత కమిటీలు ప్రతినెలా మీటింగ్ జరుపాలని ఆదేశించింది. గతంలో ఇచ్చి న ఆదేశాలతోపాటు భవిష్యత్తులో ఇచ్చే ఆదేశాల అమ లు కూడా ఈ సమావేశాల్లో సమీక్షించాలని చెప్పింది. సీఆర్పీసీ సెక్షన్ 160 లేదా బీఎన్ఎస్ఎస్లోని 179 సెక్షన్ ప్రకారం.. 15 సంవత్సరాల్లోపు పిల్లలు. 65 సంవత్సరాలకు పైబడినవారు, మానసిక లేదా శారీరక వైకల్యం ఉన్నవారు, తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నవారు.. తమ పీఎస్ పరిధి లేదా సమీప పీఎస్ పరిధిలో లేని, వేరే రాష్ట్రంలో ఉండే వాళ్లను వారి నివాసంలోనే విచారణ చేయాలి తప్ప ఫలానా చోటనే విచారణ చేస్తామనే 160 సెక్షన్ నోటీసుకు చట్టబద్ధత లేదని తెలిపింది.