న్యూఢిల్లీ: వర్షాలు ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి. నైరుతీ రుతుపవనాలు(Southwest Monsoon) జూన్ 4వ తేదీ నాటిని కేరళను తాకే అవకాశాలు ఉన్నాయని భారతీయ వాతావరణ శాఖ తెలిపింది. సాధారణంగా జూన్ ఒకటో తేదీ నాటికి నైరుతి కేరళను తాకుతుంది. దీంతో వర్షాకాలం మొదలవుతుంది. అయితే ప్రస్తుతం మబ్బుల రాక ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది. జూన్ 4వ తేదీ వరకు కేరళ, తమిళనాడు, అరేబియా సముద్రం, లక్షద్వీప్‌తో పాటు మరికొన్ని ప్రాంతాలకు నైరుతి చేరుకునే అవకాశాలు ఉన్నట్లు ఐఎండీ అంచనా వేసింది. మే 26వ తేదీ వరకు నైరుతి రానున్నట్లు గతంలో ఐఎండీ చెప్పిన విషయం తెలిసిందే. కానీ నైరుతి ఆలస్యం అవుతున్న నేపథ్యంలో మే 29వ తేదీన కొత్త అప్డేట్ ఇచ్చారు. ఈసారి వానాకాలంలో దేశవ్యాప్తంగా సాధారణం కన్నా తక్కువ స్థాయిలో వర్షాలు ఉంటాయని గత వారం ఐఎండీ పేర్కొన్న విషయం తెలిసిందే.