న్యూఢిల్లీ: కామన్వెల్త్ క్రీడలకు ముందే భారత్ భారీ జలక్ తగిలింది. మిడిల్ డిస్టెన్స్ రన్నర్ కేఎం దీక్ష(KM Deeksha).. డోపింగ్ వలలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. 1500 మీటర్ల ఈవెంట్లో దీక్ష జాతీయ రికార్డు హోల్డర్. అయితే ఆమె శ్యాంపిల్‌లో నిషేధిత ఉత్ప్రేరకం ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతానికి ఆమెపై ఎటువంటి సస్పెన్షన్ విధించలేదు. కానీ కామన్వెల్త్ గేమ్స్‌కు ఆమె అర్హత సాధించేది డౌట్‌గా ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. మే చివరి వారంలో దీక్షకు ఓ లేఖను అందజేసినట్లు కూడా కొన్ని వర్గాల ద్వారా తెలిసింది.
రన్నర్ దీక్ష శ్యాంపిల్‌లో స్టానోజోలోల్ అనే పదార్ధాం ఉన్నట్లు భావిస్తున్నారు. ప్రపంచ డోపింగ్ సంస్థ వాడా ఆ పదార్ధాన్ని బ్యాన్ చేసింది. అనబాలిక్ ఏజెంట్ల లిస్టులో ఆ పదార్ధం ఉంది. ఒకవేళ దీక్ష ఆ ఉత్ప్రేరకాన్ని తీసుకున్నట్లు రుజువైతే, ఆమెకు నాలుగేళ్ల వేటు పడే అవకాశాలు ఉన్నాయి. గత ఏడాది లాస్ ఏంజిల్స్‌లో జరిగిన సౌండ్ రన్నింగ్ ట్రాక్ ఫెస్ట్ ఈవెంట్లో ఆమె కొత్త జాతీయ రికార్డును స్థాపించింది. 4:04.78 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని మూడవ స్థానంలో నిలిచింది. 2026 ఏప్రిల్ 5వ తేదీన జైపూర్‌లో జరిగిన ఇండియన్ అథ్లెటిక్స్ సిరీస్2లో గోల్డ్ మెడల్ గెలిచిన తర్వాత దీక్ష మళ్లీ ఎటువంటి టోర్నీల్లో ఆడలేదు.
భోపాల్‌లోని మధ్యప్రదేశ్ అథ్లెటిక్స్ అకాడమీలో ఎస్కే ప్రసాద్ వద్ద ఆమె శిక్షణ పొందుతోంది. అయితే గత నెలలోనే ఆ శిక్షణా కేంద్రం నుంచి దీక్ష వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. బ్యాన్ చేసిన ఉత్ప్రేరకం వాడినట్లు వస్తున్న వార్తలపై స్పందించేందుకు దీక్ష కోచ్ నిరాకరించారు.