హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ) : ‘మనిషికి మనిషి తోడు..’ ‘ఆపదలో ఆదుకునే సాటి మనిషే దేవుడు’ అని పెద్దలు చెప్తుంటారు. ఇది నిజమేనని తెలిపే ఎన్నో స్ఫూర్తిదాయకమైన ఘటనలు ఉన్నాయి. ప్రాణాలకు తెగించి మరీ ఇతరుల ప్రాణాలను కాపాడిన ఆదర్శమూర్తులను చూస్తుంటాం. కానీ కొన్ని సందర్భాల్లో కొందరి ప్రవర్తన చూస్తుంటే ఆశ్చర్యం.. ఆందోళన కలుగకమానదు. మరీ.. ప్రాణాలకు తెగించి చేయాల్సిన సాహసం ఏమీ లేదు.. కేవలం ఓ చేయి అందిస్తే ప్రాణాలు నిలిపే అవకాశమున్నా.. పట్టించుకోని ధోరణి కొందరిలో కనిపిస్తున్నది. ముఖ్యంగా చాలామంది సమాజానికి దూరమై… సామాజిక మాధ్యమాల్లోనే జీవించడం అలవర్చుకున్నట్టు అనిపిస్తున్నది. ఆనందం కలిగితే ఆస్వాదించకుండా… బాధ కలిగితే తోటివారితో చెప్పుకోకుండా.. ఇతరుల ఆపద చూస్తే ఆపన్నహస్తం అందించకుండా… విషయం ఏదైనా సోషల్‌మీడియాలో పోస్ట్ చేసుకోవడం వీరి వింత ప్రవర్తనలో ప్రధాన లక్షణం. ఇది సమాజంలో వింత ధోరణికి, మనుషుల్లో విచిత్ర ప్రవర్తనకు దారి తీస్తున్నది. తాజాగా చేవెళ్ల బస్సు ప్రమాద ఘటన వద్ద కొందరు స్థానికులు సహాయ చర్యల్లో నిమగ్నమయ్యారు. కానీ కొందరు మాత్రం.. బాధితుల ఆర్తనాదాలను వినకుండా, ఆపన్న హస్తం అందించకుండా ఫొటోలు, వీడియోలు తీస్తూ జడపదార్థాలుగా, మనసులేని రాతిబొమ్మలుగా ప్రవర్తించారు. ఇదంతా చూస్తుంటే… ఏదైనా ఆపద వచ్చినప్పుడు… ‘మన చుట్టూ చాలామంది మనుషులు ఉన్నారులే.. ఏం కాదు..!’ అని ధీమాగా ఉండే పరిస్థితి కనిపించడంలేదు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే.. ‘అసలు.. ఈ మనుషులకు ఏమైంది?’ అనే సందేహం కలుగక మానదు.
అరచేతిలో ప్రపంచాన్ని చుట్టి వచ్చే సెల్‌ఫోన్.. మానవత్వాన్ని మరిచిపోయేలా చేస్తోంది. సాటి వ్యక్తి ఆపదలో ఉంటే అక్కున చేర్చుకోవాల్సింది పోయి.. వీడియోలు చిత్రీకరించే విచిత్రమైన మానసిక రుగ్మతతో కొందరు ప్రవర్తిస్తున్నారు. చుట్టూ ఏం జరిగినా సోషల్ మీడియలో పంచుకోవాలనే ఆత్రుతతో మనిషులుగా బాధ్యతను మర్చిపోతున్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు ఘటనా స్థలంలో ఇలాంటి వింత మనుషులు ప్రత్యక్షమవుతారు. ఇటీవల కర్నూల్ బస్సు ప్రమాద ఘటన సమయంలో చాలామంది ఫోన్లో వీడియో తీశారు కానీ.. పోలీసులకు, అంబులెన్స్‌కు సమాచారం ఇవ్వలేదు. కొందరే స్పందించి.. ఆదుకోవడానికి ఏం చేయాలా అని ఆలోచించారు. తాజాగా మీర్జాగూడలో ఆర్టీసీ బస్సు ప్రమాదంలోనూ కొందరి వింత ప్రరవర్తన కనిపించింది. ఇక్కడ ఓ ప్రమాదం జరిగిందని సోషల్‌మీడియాలో చెప్పుకోవడానికి కొందరు ఆరాటపడ్డారు. కానీ ఎదుట కంకరలో కూరుకుపోయిన వారి ఆర్తనాదాలను పట్టించుకోలేదు. మరికొందరు మాత్రం.. సహాయ చర్యలను చేపట్టారు.
‘నేను కంకరలో కొంతవరకు కూరుకుపోయాను. నా కండ్ల ముందే చాలా మంది మరింత ప్రమాదకరంగా కంకరలోనే చిక్కుకుని ఉన్నారు. కాపాడండి అని వేడుకున్నాం. పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మీ కాళ్లు మొక్కుతం.. కంకర తియ్యున్రి అంటే కొందరు అస్సలు ఏమీ వినిపించుకుంటలేరు. ఫొటోలు, వీడియోలు తీస్తున్నరు. కంకర ఎట్ల తొలగిస్తం.. పారలు లేవు కదా అన్నరు కొందరు. ఏదో ఒక రకంగా తలా ఓ చేయి వేస్తే ఆదుకోవచ్చు కదా. అట్ల కొందరు కాపాడుతేనే మేం కంకరలో నుంచి బయటకు వచ్చినం. కొందరి ప్రవర్తన చూస్తే ఆశ్చరం కలిగింది’ అని ఓ బాధితురాలు వాపోయారు.